ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషను వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమీషను నోటిఫికేషను వెలువవడంతో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ మార్చి 8వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల్లోను, పబ్లిక్ ప్రదేశాల్లో రాజకీయ నాయకులు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు లేకుండా చూడాలని, విగ్రహాలకు
ముసుగులు వేసే విధంగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో తుపాకుల లైసెన్సులు కలిగిన వ్యక్తుల నుండి ఆయుధాలను డిపాజిట్ అయ్యే విధంగా చూడాలన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూటివ్ చేయాలని, ఇందుకు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని, మద్యంను అక్రమంగా విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. రాత్రి బీట్లును, పగటి బీట్లును వేయాలని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ముందుగా గుర్తించి, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. దత్తత గ్రామాల్లో పోలీసు సిబ్బంది వారంలో రెండుసార్లు సందర్శించి, క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించి, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందించాలని పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఎన్నికల కోడ్ ను అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత సిఐలు వారి పరిధిలోని పని చేసే ఎస్ఐలకు మార్గదర్శకం చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు తీరును విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్. రాఘవులు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. (Story : ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి)