నంబరు-2 రూటెటు?
జగన్ వ్యతిరేకులతో విజయసాయిరెడ్డి..
వరుస భేటీలతో వైసీపీ కలవరం
తారకరత్న భార్య కుటుంబీకులతో ఫోటో
లోటస్‌పాండ్‌లో షర్మిలతో చర్చలు
కుమార్తె నేహారెడ్డి బీజేపీ వైపు చూపు!
న్యూస్ తెలుగు/అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత ఆ పార్టీలో నంబర్2గా చలామణి అయిన, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఆయన రూటు ఎటు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీ పార్టీకీ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో అదునుచూసి ఆయన రాజీనామాను ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది వైసీపీ పార్టీకీ, శ్రేణులకూ పెద్దషాక్‌గా మారింది. ఎవ్వరూ ఊహించలేనంతగా ఈ పరిణామం విస్తుగొలిపింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై ముఖ్యనేతలు సైతం తడబాటుకు గురయ్యారు. ఎలా స్పందించాలో తెలియక రెండు రోజులపాటు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధికారిక ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి రాజీనామాను తాము స్వీకరించలేకపోతున్నామని, ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని, వ్యవసాయం సాగు చేసుకోవాలన్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. విజయసాయిరెడ్డి సైతం తన రాజీనామా చేసే సమయంలో ఎక్స్‌వేదికగాను, ఉప రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన తర్వాత మీడియా సమావేశంలోనూ ఎక్కడా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పైన, ఆ పార్టీపైనా తూలనాడలేదు. పన్నెత్తి మాటనూ మాట్లాడలేదు. తాను పార్టీని వీడినప్పటికీ, తన లాంటి వారు 100 మందిని జగన్ తయారు చేసుకోగలడంటూ విజయసాయిరెడ్డి కితాబిచ్చారు. అక్కడ వరకూ బాగానే ఉంది. ఇక విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారన్న సమాచారంతో వైసీపీలోని ముఖ్యనేతలు, మాజీ మంత్రులు అరకొరగా స్పందిస్తూ..ఆయన పార్టీని వీడటం బాధాకరమని, పార్టీకి నష్టమే అంటూ పొదుపుగా వ్యాఖ్యానించారు. కాకినాడ వైసీపీ మాజీ ఎంపీ వంగా గీత మాత్రం..పార్టీ నుంచి ఎవ్వరు వెళ్లినా నష్టం లేదంటూ పరోక్షంగా ఆమె మాట్లాడారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడకముందే వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు, మాజీ మంత్రులు వరుసగా, వంతులవారీగా రాజీనామా బాటపట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ యాదవ్, ఆర్.కృష్ణయ్యకు ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ, వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, రాజ్యసభలో 11సీట్లతో బలంగా ఉంది. ఆ తర్వాత కూటమి నేతల ప్రభావంతో వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద బస్తాన్ యాదవ్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో ఆ బలం కాస్తా..8కి పడిపోయింది. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏడుగురు సభ్యులకు దిగిపోయింది. మరికొంత మంది రాజ్యసభ సభ్యులు వారిబాటలోనే వైసీపీకి గుడ్‌బై చెబుతారన్న ప్రచారముంది. అది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
లోటస్‌పాండ్‌లో షర్మిలతో భేటీ !
లండన్ నుంచి వైసీపీ అధినేత తిరిగి రావడంతోనే విజయసాయిరెడ్డి చేస్తున్న చర్యలు వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోననీ, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన వ్యక్తి నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి వైసీపీ శ్రేణుల్లో కలవరం పుట్టించారు. షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల భేటీ అయినట్లు ప్రచారం వచ్చింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు వీరిరువురూ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిసింది. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నందమూరి కుటుంబంతో సరదాగా విజయసాయిరెడ్డి..
తాజాగా నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతోపాటు ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. నందమూరి కుటుంబసభ్యుడు, టీడీపీ పార్టీ దివంగత నేత తారకరత్న భార్య అలేఖ్య గురించి తెలిసే ఉంటుంది. విజయసాయిరెడ్డి ఈమెకు బాబాయి వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్యల ప్రేమ వివాహానికి ఇరువురి కుటుంబాలు అంగీకరించకపోవడంతో విజయసాయిరెడ్డే మద్ధతు ఇచ్చినట్లుగా గతంలో అలేఖ్య వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల అలేఖ్య కుటుంబంతో కలిసి కాసేపు గడిపారు. ఆ ఫోటోను ‘వీకెండ్ విత్ విఎస్‌ఆర్’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడా? లేదా ? అనే సంగతి కచ్చితంగా తెలియకపోయినా..ఆయన కుమార్తె నేహారెడ్డి మాత్రం బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం విస్తృతంగా ఉంది. వైసీపీని వీడితే వీడారు.. ఇలా వైఎస్ జగన్‌ను వ్యతిరేకిస్తున్న కుటుంబీకులతో విజయసాయిరెడ్డి వరుస భేటీలు కావడం వైసీపీ నేతలకు మింగుడుపడటంలేదు. ఏదేమైనప్పటికీ, విజయసాయిరెడ్డి ప్రయాణం ఎటువైపు సాగుతుందనేది రాజకీయ వర్గాల్లో అమితమైన ఆసక్తిని కలిగిస్తోంది. (Story: నంబరు-2 రూటెటు?)
See Also: