నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
న్యూస్తెలుగు/వనపర్తి : ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరికీ ఆల్బెండజోల్ మాత్రలు తినిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, ఫిబ్రవరి 10న అటెండెన్స్ సమయంలోనే విద్యార్థులకు ఈ మాత్రలు తినిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. అవసరమైన మాత్రలు అన్ని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు అందించే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిబ్రవరి 10న ఏదైనా కారణం చేత మాత్రలు వేసుకోకుండా మిగిలిపోతే అలాంటి వారిని ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు గుర్తించి మాత్రలు తినిపించాల్సి ఉంటుందన్నారు. ఈ టాబ్లెట్ వేసుకోవడంలో ఏ ఒక్క విద్యార్థి దూరం కాకూడదని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం టాబ్లెట్లు అందించాలన్నారు. 1 నుంచి 2 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర, 2-3 సంవత్సరం పిల్లలకు 400 mg ఒక మాత్ర చూర్ణం చేసి అంగన్వాడీ కేంద్రాల్లో తినిపించాలన్నారు. 4 నుండి 19 ఏళ్లు వయస్సు గల వారికి పాఠశాలలు, కళాశాలలో, హాస్టల్ , గురుకుల, కే.జి.బి.వి ల్లో ఒక మాత్ర 400 mg మందును దగ్గరుండి తినిపించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, పాఠశాల, కళాశాల స్థాయిలో సంబంధిత ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ మాత్రలు తినిపించే విధంగా బాధ్యతలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు చిన్న పిల్లలు మట్టిలో ఆడడం, ఆ తర్వాత నేరుగా తినడం వల్ల శరీరంలో నులిపురుగులు తయారవుతాయని వివరించారు. ఈ పురుగులు పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయని తద్వారా పిల్లల్లో రక్తహీనత, అనిమియా ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల పిల్లలు భుజించిన ఆహారం ఒంటికి పట్టకపోవడం, సరైన ఎదుగుదల ఉండకపోవడం, తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు, ఆర్డివో సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సాయినాథ్ రెడ్డి, పరిమళ, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story : నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి)