అన్నల బాటలోనే అసువులు బాసి
– ఇంటర్ తర్వాత అజ్ఞాతంలోకి బడే చొక్కా రావు
– రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన నేత
– సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి హోదాలో మృతి
– తలపై 75 లక్షల రివార్డు
– అంతర్మధనంలో మావోయిస్టు పార్టీ
– స్వగ్రామంలో విషాదఛాయలు
న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం :తోడబుట్టిన సోదరుల స్ఫూర్తితో అజ్ఞాతంలోనికి వెళ్లిన మావోయిస్టు అగ్రనేత, సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు (55) అలియాస్ దామోదర్ ఈనెల 16న జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఇంటర్ చదువుతుండగానే అన్నలలైన బడే నాగేశ్వరరావు, బడే మురళి ద్వారా ప్రేరేపితుడై ఇంటర్ పూర్తి అవ్వగానే 30 ఏళ్ల క్రితం తుపాకీ పట్టారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ తనదైన శైలిలో దాడులకు రూపకల్పన చేసే సత్తా ఉన్న ఆయన సాధారణ కార్యకర్త నుండి డివిజన్ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు. చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో బడే చొక్కా రావు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన విషయం విధితమే. ఆయన మృతితో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలగా, బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ 30 ఏళ్ల అజ్ఞాతప్రస్థానానికి తెర పడినట్లుంది.
పూర్తి మావోయిస్టు కుటుంబంగా పేరుబడ్డ బడే చొక్కారావు సోదరులు బడే నాగేశ్వరరావు, బడే మురళి వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. కీలకఅగ్రనేత బడే చొక్కా రావును కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఆయన తాజా ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఆయన మృతిని నిర్ధారిస్తూ చత్తీస్గడ్ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ విడుదల చేసిన లేఖలో ఇంకా పలు విషయాలు ప్రస్తావించారు.
మొత్తం 18 మంది మావోయిస్టు మృతి /// ఈ నెల 16 గురువారం జరిగిన ఎదురుకాల్పులలో చొక్కా రావు తో పాటు దేవే, నరసింహారావు, హుంగి తో పాటు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సిపిఐ (మావోయిస్టు) వెల్లడించింది. ఉదయం 9 గంటల నుండి పొద్దుపోయేంత వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందడంతో పాటు పదిమంది జవాన్లకు పైగా తీవ్ర గాయాలయ్యాయి. బీజాపూర్ సుకుమా జిల్లా సరిహద్దుల్లోని తాలిపేరు, చింతవాగు నదుల తీరాల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా నేతృత్వంలో పి ఎల్ జి ఏ బెటాలియన్ 1 కు చెందిన రెండు పార్టీల
180 మంది మావోయిస్టులు క్యాంపు నిర్వహిస్తుండగా సుమారు 5000 మంది గల భద్రతా బలగాలు చేరుకోవడంతో పూజారా కాంకేరి – మారేడుబాక అటవీ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అడవుల్లో భద్రతా బలగాలు అరాచాలకు పాల్పడుతున్నాయని, గిరిజన మహిళలను అత్యాచారం చేస్తూ మోటార్ సైకిళ్లు ట్రాక్టర్లను తగుల బెడుతున్నాయని, గిరిజన యువతను అన్యాయంగా అరెస్టు చేస్తూ జైళ్ళ పాలు చేస్తున్నాయని సిపిఐ మావోయిస్టు విడుదల చేసిన లేఖలో ఘాటుగా విమర్శించింది.
30 ఏళ్ల అజ్ఞాతం//// మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న బడే చొక్కా రావు ఇంటర్ పూర్తి అవ్వగానే అజ్ఞాత బాట పట్టారు. సమ్మక్క సారక్క తాండ్వాయి మండలం కల్పవల్లి గ్రామానికి చెందిన బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ చతిస్గడ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన దాడులను రూపకల్పన చేయడంలో సిద్ధహస్తుడిగా చెబుతారు. కొరకరాని కొయ్యగా మారిన ఆయన తలపై చతిస్గడ్ రాష్ట్ర ప్రభుత్వ 50 లక్షలు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 25 లక్షలతో కలిపి మొత్తం 75 లక్షల రివార్డు ఉంది.
ఎదిగిన ప్రస్థానం/// పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితుడై 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోనికి వెళ్లిన బడే చొక్కా రావు అంచలంచలుగా ఎదిగారు. తొలుత ఖమ్మం కరీంనగర్ వరంగల్ (కే కే డబ్ల్యూ) కార్యదర్శిగా పనిచేసిన ఆయన అనంతరం జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి జే యం డబ్ల్యూ సి డివిజన్ కమిటీ ని ఏర్పాటు చేసి ఆ కమిటీకి కార్యదర్శి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. 2021లో అప్పటి సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ కోవిడ్ తో మృతి చెందడంతో కేంద్ర కమిటీ చొక్కారావు కు 2024 జనవరి 10న రాష్ట్ర కార్యదర్శి హోదాను అప్పగించింది. అదే హోదాలో మృత్యువాత పడ్డారు. చొక్కా రావు మృతి పోరాట స్ఫూర్తిని నింపిందని, ఆయన ఆశయాలను సాధిస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటించుకుంది.
అంతర్మధనం, విషాదఛాయలు//// కరోనా నుండి మొదలుకొని ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ పలువురు నేతలను కోల్పోతూ వస్తోంది. తాజాగా ఏడాది నుండి వరుస దెబ్బలతో సతమతమవుతోంది. గెరిల్లా దాడుల కీలక వ్యూహకర్త హిడ్మా ఎన్కౌంటర్ నుండి బయటపడగా, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చతిస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస వైఫల్యాలను మూటకట్టుకుంటున్న మావోయిస్టులు భవిష్యత్తు కార్య చరణ రూపకల్పనలో అంతర్మధనంలో పడక తప్పదని పలువురి విశ్లేషకుల వాదన. ఇదిలా ఉండగా బడే చొక్కా రావు స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చట్టంతో కాకుండా తుపాకీ గొట్టంతోనే అసలైన రాజ్యస్థాపన సాధ్యమని బడే చొక్కా రావు తో సహా ఆయన ఇద్దరు సోదరులు అడవిబాట పట్టారు. అంచలంచెలుగా ఎదుగుతూ దళం లో అనేక హోదాల్లో పని చేసిన ముగ్గురు సోదరులూ వేర్వేరు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. (Story : అన్నల బాటలోనే అసువులు బాసి)