విద్యార్థులు భవిష్యత్తులో కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు కూడా భవిష్యత్తులో కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అన్నారు. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన తెలంగాణ ఎలక్ట్రిసిటీ నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ దేవరాజుల నాగార్జున, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
కళాశాలలో చదివి ప్రస్తుతం ఉన్నత స్థాయికి ఎదిగిన ఆర్ జె డి రాజేంద్ర సింగ్, గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సహా పలువురు తమ సహచర పూర్వ విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కళాశాల పూర్వ విద్యార్థులు సన్మానించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ” సమాజంలో బాధ్యత కలిగిన పౌరులం అంటూ”.. సమాజ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమకు విద్యా బుద్దులు నేర్పి ఉన్నత స్థాయికి చేర్చిన తమ గురువులకు ఘనంగా సన్మానించారు. కళాశాల స్థాపనకు కీలకమైన వ్యక్తి టైపు కృష్ణయ్య కూతురు సరళ ను, అప్పటి వనపర్తి ఎమ్మెల్యే జయరాములు కుమారుడు శ్రీనివాసులు ను, మరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య కుమార్తె జయంతి లను వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. చాలాకాలం తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు కలుసుకున్న సందర్భంగా ఆత్మీయంగా పలకరించుకున్నారు. సరదాగా ముచ్చటించుకుని, ఒకరితో ఒకరు సెల్ఫీలు దిగారు. తాము కాలేజీలో చదువుకున్న రోజులని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ఆనందంలో మునిగితేలారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి పట్టణం విద్యాపర్తిగా పేరు గాంచిందని చెప్పారు. 1974లో స్థాపించిన ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిందని, ఇక్కడ చదువుకున్న వారు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు కూడా భవిష్యత్తులో కళాశాలకు, వనపర్తికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధికి, అదేవిధంగా కళాశాలలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ గా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థిగా తనవంతుగా లక్ష రూపాయల విరాళం ఇస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, సభాధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, మీడియా కమిటీ సమన్వయకర్త మల్యాల బాలస్వామి, పూర్వ విద్యార్థులు వెంకటేశ్వరరావు, ప్రభుత్వ న్యాయవాది కిరణ్ కుమార్, పూర్వ విద్యార్థులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యార్థులు భవిష్యత్తులో కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి)