ప్రతి రైతు కుటుంబంలో సంతోషమే సీఎం చంద్రబాబు ఆశయం
నరసరావుపేటలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న జీవీ, ప్రత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జూలకంటి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ప్రతిరైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకు కావాల్సిన సమృద్ధిగా నీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, ఇతర సౌకర్యాలు, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. నరసరావుపేట భువనచంద్ర టౌన్‌హాల్‌లో శనివారం నాగార్జున్‌సాగర్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, తితిదే పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన కాంతారావు, వైస్ ఛైర్మన్ ఉప్పలపాటి చక్రపాణిని నేతలంతా ఘనంగా సత్కరించారు. తర్వాత మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ 2047 కల్లా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకోసం 60%మంది వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో రైతులకు నీటి భద్రత కల్పించాల్సి ఉంది. పోలవరంతో పాటు 6 ప్రధాన ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన నీటిసంఘాల నాయకులు ఆయకట్టులో ప్రతి చివరి ఎకరాకు సక్రమంగా నీళ్లందేలా పర్యవేక్షించాలని సూచించారు. వారు కష్టపడి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని, రైతుల కోసం చేసిన మంచి పనులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసు కుని వెళ్లాలన్నారు. ఇదే సమయంలో అయిదేళ్ల జగన్ పాలనలో ఒక్క కాలవ కూడా బాగు చేయలేదు, ఒక్కదానిలో కూడా పూడిక తొలగించలేదని మండిపడ్డారు . రైతులకు ఉపయోగపడే ఒక్క పనీచేయకుండా గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతు ఆత్మహత్య ల్లో రాష్ట్రాన్ని దేశంలో నే అగ్రస్థానంలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అడ్డుకున్న గోదావరి పెన్నా అనుసంధానాన్ని త్వరలోనే పూర్తి చేసి 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేస్తామన్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమకు కూడా నీళ్లు ఇస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా వచ్చి తీరుతుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. వరికెపూడిశెల ప్రాజెక్టుపైనా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సీఎంతో మాట్లాడామని, అది కూడా పూర్తి చేసుకుంటామన్నారు.(Story : ప్రతి రైతు కుటుంబంలో సంతోషమే సీఎం చంద్రబాబు ఆశయం )