క్షయ వ్యాధిని నివారించేందుకు 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో క్షయ వ్యాధిని నివారించేందుకు చేపడుతున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. 2025 మార్చి, 24 నాటికి క్షయ వ్యాధిని దేశం నుండి పారద్రోలడనికి భారత ఆరోగ్య శాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను వనపర్తి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు గురువారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం హైదారాబాద్ నుండి వచ్చిన రాష్ట్రస్థాయి నిపుణులు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ సూపర్వైజర్లకు 100 రోజుల్లో క్షయ వ్యాధి గ్రస్తులను ఏవిధంగా గుర్తించాలి, వైద్య పరీక్షలు, వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి పరీక్షలు లక్ష్యం మేరకు చేయనందువల్ల భారత వైద్య ఆరోగ్య శాఖ వనపర్తి జిల్లాను క్షయ వ్యాధి సమస్యాత్మక జిల్లాగా గుర్తించిందన్నారు. 2025 మార్చి, 24 వరకు దేశంలో క్షయ వ్యాధి ఆనవాళ్లు లేకుండా పారద్రోలడనికి వంద రోజుల. కార్యాచరణ చేపట్టిందన్నారు. డిసెంబర్ 7 నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక క్షయ వ్యాధిగ్రస్తులకు గుర్తించి వైద్యం చేయాల్సి ఉంటుందన్నారు. ఆశా, ఏ ఎన్.యం లు ఇంటింటికి తిరిగి కుటుంబంలో ఎవరికైనా 2 వారాలకు పైగా తెమడతో కూడిన దగ్గు రావడం, జ్వరం, నీరసం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, పొగ త్రాగే వారిని, తరచూ మద్యపానం చేసేవారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ వైద్య పరీక్షల కొరకు జిల్లాలో ఒక మొబైల్ ఎక్సరే మిషన్ కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే వైద్యం ప్రారంభించాలని సూచించారు. వనపర్తి జిల్లాలో క్షయ వ్యాధి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్య సిబ్బంది గట్టిగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎ శ్రీనివాస్, ఉప వైద్య అధికారి డా .బి. శ్రీనివాస్, క్షయ వ్యాధి ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయినాథ్ రెడ్డి, డబ్లూ.హెచ్.ఒ స్టేట్ కన్సల్టెంట్ డా. మహేష్, డా. భాను కిరణ్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. (Story : క్షయ వ్యాధిని నివారించేందుకు 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి)