సమాజ క్షేమం కొరకే పౌర్ణమి గరుడ సేవ
ఆలయ ఈవో వెంకటేశులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవను సమాజ క్షేమము కొరకే నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనములో ఆశీనులు చేశారు. తదుపరి స్వామి వారిని వివిధ పూలమాలలతో, పట్టు వస్త్రాలతో అలంకరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహించే విధంగా ప్రతినెల దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి పౌర్ణమి గరుడ సేవకు దాతగా బాబు సర్వేయర్, నాయకుల చిరంజీవి, లక్ష్మీ ప్రతాప్, కొప్పల మారుతి కుమార్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ దాతలకు అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్లు వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. తదుపరి అన్నమయ్య సేవా మండలి పొరాల్ల పుల్లయ్య ,వారి శిష్య బృందం చే సంకీర్తనలు, తదుపరి కోలాట నృత్యం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామి వారు పట్టణ పురవీధులలో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : సమాజ క్షేమం కొరకే పౌర్ణమి గరుడ సేవ)