వనపర్తి జిల్లాలో 31 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో 31 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా శుక్రవారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో పెరుగుతున్న ఓటర్ల దృష్ట్యా, ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రం ఓటరు ఇంటి నుండి 2 కిలోమీటర్లకు ఎక్కువ దూరం ఉన్న వాటిని పరిశీలించి 31 కొత్త పోలింగ్ కేంద్రాలు, 6 లోకేషన్ మార్పులు, కొన్ని పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు కు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. ఇందులో వనపర్తి నియోజకవర్గంలో 20 కొత్త పోలింగ్ కేంద్రాలు, దేవరకద్ర లో 4, మక్తల్ నియోజకవర్గంలో 1, కొల్లాపూర్ నియోజక వర్గంలో 6 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు. కొత్త పోలింగ్ కేంద్రాలు, స్థల మార్పు పై గూగుల్ ఎర్త్ చిత్ర పటం ద్వారా చూపించారు. ఏమైనా అభ్యంతరాలు, మార్పు చేర్పులు ఉంటే చెప్పాలని రాజకీయ పార్టీల ఆమోదంతో ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్ కు పంపనున్నట్లు తెలియజేశారు. స్పందించిన పార్టీల ప్రతినిధులు స్థానికంగా కొన్ని పోలింగ్ కేంద్రాల మార్పుకు సిఫారసు చేశారు. టీచర్స్ కాలని, ఆర్టీసీ కాలని లో కొంత మంది ఓటర్లకు దూరం అవుందని, దూరం అవుతున్న వారికి సమీప పోలింగ్ కేంద్రానికి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందించిన కలెక్టర్ మార్పు పై పరిశీలిస్తానని తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అవుతున్న యువత పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కొత్త ఓటర్ల దరఖాస్తులు, తొలగించాల్సిన ఓటర్ల దరఖాస్తులు, మార్పు చేర్పుల దరఖాస్తు వివరాలు ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల కై రూపొందించిన తుది ఓటరు జాబితా ఇప్పటికే ప్రచురించి అన్ని గ్రామ పంచాయతీల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉంచడం జరిగిందన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో వచ్చిన ఫిర్యాదులు అన్ని పరిష్కరించి తుది జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక ప్రతిని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీవో పద్మావతి, ఈ సెక్షన్ సూపరిండెంట్ కిషన్ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నుండి వెనాచారి, బి.ఆర్.ఎస్ సయ్యద్ జమిల్ , బిజెపి నుండి కుమార స్వామి, యం. ఐ.యం నుండి రహీం, సి.పి.యం. నుండి యం.డి. జబ్బార్, డి టి లు తదితరులు పాల్గొన్నారు. (Story : వనపర్తి జిల్లాలో 31 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం)