దసరా రద్దీ: 6100 ప్రత్యేక బస్సులు
4 నుంచి 20వరకు రాకపోకలు
ముందస్తు రిజర్వేషన్`తక్కువ ధరతో టిక్కెట్లు
ప్రయాణికుల ముంగిటకు 6,100 సర్వీసులు
న్యూస్ తెలుగు/అమరావతి : దసరా పండుగతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ 6,100 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ప్రయాణీకులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రాకపోకలకూ ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచి పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించడం, దానికితోడు పండుగ రావడంతో ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నయ్, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 4నుండి 20వ తేదీ వరకూ మొత్తం 6,100 సర్వీసులను నడిపేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. అక్టోబర్ 4 నుండి 11 వరకు దసరా ముందు 3,040 బస్సులు, అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకూ దసరా తర్వాత మరో 3,060 ప్రత్యేక బస్సులను నడుపుతారు.రాష్ట్రంలోని అన్ని ముఖ్య నగరాలు, పట్టణాలు, ప్రాతాలకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు బస్సులు వెళ్తాయి. వాటితోపాటు రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్నాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ చార్జీలపై పది శాతం రాయితీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బస్సుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు, సూపర్ వైజర్లను నియమించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడిరచారు. ప్రయాణికులకు చిల్లర సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు, అందుకు ఫోన్‌పే, డెబిట్‌కార్డు తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒక వైపు ఏపీ నుంచి తర రాష్ట్రాలకు, మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయన్నారు. ప్రయాణికులకు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు..149, 0866`2570005 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (Story: దసరా రద్దీ: 6100 ప్రత్యేక బస్సులు)