మొక్కుబడిగా విజిలెన్స్ విచారణ
-సిపిఐ ఏరియా కార్యరదర్శి బూదాల శ్రీను విమర్శ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : తెల్లరేషన్ కార్డు లబ్ధి దారులకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఇవ్వకుండా, నగదు ఇస్తూ అక్రమ బియ్యం వ్యాపారానికి పాల్పడుతున్నారని, ఈ విషయమై తాము తహశీల్దారుకు ఫిర్యాదు సమర్పించామని సీపీఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలిపారు. అయితే తమ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణకు వచ్చారని, రేషన్ షాపుల వద్ద మొక్కుబడిగా విచారణ జరిపి వెళ్ళారని, ప్రజా సంఘాలనుకానీ, లబ్ది దారులను కానీ విచారించలేదని ఆరోపించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బూదాల శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడు నెలలుగా ఎండియూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా నిలిచిపోయిందని, రేషన్ దుకాణాల వద్ద లబ్ధి దారులు ఇబ్బందులుపడుతున్నారని, రేషన్ షాపుల వద్ద ఎండియూ వాహన దారుని వేలిముద్రతో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చూపుతూ బియ్యంకు బదులు డబ్బులు ఇస్తున్నారని, తద్వారా బియ్యం పెద్ద మొత్తంలో నిల్వ చేసి, అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే నెలలో ప్రతి ఒక్క లబ్ది దారునికి బియ్యం ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో తాము ప్రజల పక్షాన నిలబడిపోరాటం చేస్తామన్నారు. విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ అధికారులు నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పిన్నెబోయిన వెంకటేశ్వర్లు, యోహాను, నాసరయ్య, కొప్పరపు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. (Story : మొక్కుబడిగా విజిలెన్స్ విచారణ)