పారిశుధ్యం పనులు పక్కాగా జరగాలి
న్యూస్ తెలుగు/ సాలూరు: పారిశుద్యం పనులు పక్కాగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా నాల్గవ రోజు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సాలూరు పురపాలక శాఖ పరిధిలోని రోడ్లు, పారిశుధ్యం పనులను పరిశీలించారు. అనంతరం పురపాలక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాలూరు రెవిన్యూ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ లకు, అలాగే పురపాలక శాఖకు రావాల్సిన ఆదాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట చెత్త తీయడం, వాటిని డ్రోన్ తో చిత్రికరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ లా పనిచేయాలని సూచించారు.
పెద్ద బజారు శానిటేషన్ ను, టౌన్ ప్లానింగ్, రైతు బజారును వాడుకలోకి తీసుకొని రావాలని పురపాలక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాబోయే 15 రోజులు పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ సూచించారు. పారిశుధ్య పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని ఆయన అన్నారు. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులను పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గుమడం వద్ద ఎస్.టి. పి.పెట్టడం జరుగుతుందని, పెద్ద బజారుకు కమిటి వేసి ఎంత ఆదాయం వస్తోందో ప్లాన్ అఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని పురపాలక సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోగా ఇంటి ప్లాన్ అప్రూవల్ ను సమర్పించాలని సూచించారు. ప్లాన్ అప్రూవల్ ఉంటేనే ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ ఋణం మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ వైస్ చైర్మన్ వంగపూడి అప్పలనాయుడు , సిబ్బంది పాల్గొన్నారు. (Story : పారిశుధ్యం పనులు పక్కాగా జరగాలి)