
ముంబై తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం
15 రోజుల్లో ముంబైలో సమావేశం నిర్వహిస్తామని హామీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం (అమరజ్యోతి) వద్ద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధులతో ముంబై తెలంగాణ ఉద్యమకారుల బృందం బుధవారం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముంబైలో నిర్వహించిన ఉద్యమాలు, ఆందోళనలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పత్రికా కథనాలు, ఇతర ఆధారాలను కమిటీకి సమర్పించింది.
తెలంగాణలోని ఉద్యమకారులకు అందుతున్నట్లుగానే ముంబైలో ఉద్యమించిన అర్హులైన వారికి కూడా తగిన గుర్తింపు, న్యాయం కల్పించాలని ప్రతినిధులు కోరారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించిన కమిటీ సభ్యులు ముంబై ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో ముంబైలో సమావేశం నిర్వహించి అక్కడి ఉద్యమకారుల వివరాలు, సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి చెందిన గౌరవ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం గారు, గౌరవ మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ గారు, గౌరవ కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు అక్కనపెల్లి దుర్గేష్, ఏలిజాల శ్రీనివాస్, బత్తుల లింగం, పొట్ట వెంకటేష్, గుండారపు శ్రీనివాస్‌తోపాటు మొత్తం 25 మంది ప్రతినిధుల బృందం సమావేశంలో పాల్గొంది.
ముంబైలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి అర్హుడికి గుర్తింపు కల్పించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రతినిధులు తెలిపారు. (Story: ముంబై తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం)