వైద్య వ్యర్థాలు మున్సిపల్ వాహనాలకు ఇస్తే చట్టరీత్యా నేరం….
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా వినుకొండ మున్సిపల్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల ఆదేశాలతో.. కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆర్ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్లతో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల నుండి వచ్చే ప్రమాదకర బయో మెడికల్ వ్యర్థాలను మున్సిపాలిటీ చెత్త వాహనాలకు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వైద్య వ్యర్థాలను పసుపు, నీలం, ఎరుపు, తెలుపు రంగు డబ్బాల్లో వర్గీకరించి, ప్రభుత్వం గుర్తించిన ‘సేఫ్ ఎన్విరాన్’ (గుంటూరు) సంస్థకు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపితే పారిశుద్ధ్య కార్మికులకు ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఆసుపత్రి ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆసుపత్రుల ప్రతినిధులు, ఆర్ఎంపీ సంఘం సభ్యులు ఇకపై నిబంధనల ప్రకారమే వ్యర్థాలను అందిస్తామని, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఆదినారాయణ, అయిల్సగ్ జిల్లా కో-ఆర్డినేటర్ శివపార్వతి, ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయరాజ్, కోశాధికారి హుస్సేన్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : వైద్య వ్యర్థాలు మున్సిపల్ వాహనాలకు ఇస్తే చట్టరీత్యా నేరం…. )

