జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ విచారణ చేయగా, మొత్తం 242 మంది విద్యార్థులకు గానూ, బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు 242 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని, పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పులు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, తహసీల్దార్ రమేష్ రెడ్డి, పరీక్ష కేంద్రం సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి)

