రాష్ట్ర, వినుకొండ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉగాది శుభాకాంక్షలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, విశేషించి వినుకొండ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ‘పరాభవ’ నామ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రతి ఇంటా కొత్త ఆశలు, నూతన సంకల్పాలు చిగురింపజేసి, విజయాల దిశగా కొత్త దారులు చూపాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. జీవితంలోని కష్టసుఖాలను, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని, ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయన్నారు. ప్రతి పరిస్థితినీ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకెళ్తోందని, ప్రతి రంగంలోనూ అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో వినుకొండ నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అభివృద్ధి ఫలాలను అందుకోవాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన సుపరిపాలనతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని, అలాగే వినుకొండను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు మరింతగా కృషి చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. సమాజంలో ఐక్యత, సహకారం మరింత బలపడాలని, శాంతి, సౌభ్రాతృత్వాలు ప్రతి ఊరిలో వెల్లివిరియాలని కోరారు. ప్రతి ఇంటా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని కోరుకుంటూ, రాష్ట్ర మరియు వినుకొండ ప్రజలందరికీ ఆయన మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.(Story : రాష్ట్ర, వినుకొండ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉగాది శుభాకాంక్షలు )

