చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డాక్టర్. కె రత్న మాణిక్యం మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు బాలికల విజయాలకు గుర్తింపుగా ప్రతి కార్యాలయంలో, విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం మొత్తం పురోగమించి 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటీడీఏ ఎ.పి.ఒ శ్రీమతి సి.హెచ్ రామతులసి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, ఆడపిల్లలకు పరిమితులు విధించకుండా వారి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తే సమాజ అభివృద్ధికి తోడ్పడతారన్నారు. వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ మహిళలు విద్య,వైద్యం, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారన్నారు. సీనియర్ అధ్యాపకులు జి. వెంకటరావు మాట్లాడుతూ “ఒక మహిళ చదివితే ఒక కుటుంబం చదివినట్టే” అనే మాట అక్షర సత్యంమని, మహిళలకు విద్య,గౌరవం, అవకాశాలు కల్పిస్తే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సాధికారత విభాగాధిపతి కె.శైలజ మాట్లాడుతూ మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా వారికి సరైన అవకాశాలను అందించి ప్రోత్సహించాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ పెయింటింగ్ పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కె.శకుంతల, జి హారతి, ఎస్ అప్పనమ్మ, ఎమ్. నాగమోహన్, జి.సాయికుమార్, ఎన్. ఆనంద్,బి. శ్రీనివాసరావు,కె ఎల్ ప్రసన్న కుమారి,కె.కీర్తి, ఆర్. కిరణ్మయి,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం )

