ఘనంగా ముటుకుల సంతాన వేణుగోపాల స్వామి తిరునాళ్లు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ
న్యూస్ తెలుగు/బొల్లాపల్లి : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం ముటుకుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం క్లబ్ సభ్యులు భక్తిశ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు రోటరీ క్లబ్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక దాతలు యేరువ బ్రహ్మయ్య, హుస్సేనయ్య కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో వేలాది మంది భక్తులకు మజ్జిగ, పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ అన్నదాన, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షుడు యేరువ వెంకటనారాయణ, కోశాధికారి పొత్తూరి నవీన్ సుధాకర్, క్లబ్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ ఆలా శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. (Story:ఘనంగా ముటుకుల సంతాన వేణుగోపాల స్వామి తిరునాళ్లు)
