Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరికిపూడిశాల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలి — లేకపోతే రాజీనామా చేయాలి: రైతు, ప్రజా సంఘాల...

వరికిపూడిశాల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలి — లేకపోతే రాజీనామా చేయాలి: రైతు, ప్రజా సంఘాల హెచ్చరిక

0

వరికిపూడిశాల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలి — లేకపోతే రాజీనామా చేయాలి: రైతు, ప్రజా సంఘాల హెచ్చరిక

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక ఏనుగుపాలెం రోడ్‌లో ఉన్న సిపిఐ(ఎంఎల్) లేబరేషన్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో వరికిపూడిశాల ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు మరియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ డిమాండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ — నాలుగు దశాబ్దాలుగా ప్రజలు పోరాటాలు చేస్తున్నప్పటికీ వరికిపూడిశాల ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రాజెక్టు తీసుకొస్తామని వాగ్దానాలు చేసి తరువాత విస్మరించడం రాజకీయ పార్టీలకు అలవాటైందని విమర్శించారు. ఈసారి ముఖ్యమంత్రి సమక్షంలో ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు నిర్దిష్ట ప్రణాళికతో ప్రాజెక్టు ప్రకటన చేయించకపోతే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాల్ మాట్లాడుతూ — ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాల చెరువులకు తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రైతుల బలహీనతలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపాటి రాము మాట్లాడుతూ — పల్నాడు జిల్లాలో భూగర్భజలాలు 1300 అడుగుల లోతుకు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి రైతుల కష్టాలు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వరికిపూడిశాల జలసాధన సమితి అధ్యక్షుడు పల్నాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ — దుర్గి, వెల్దుర్తి, బల్లాపల్లి, పుల్లలచెరువు మండలాల్లో రైతులు నీటి కొరతతో పంటలు వేయలేక వలస వెళ్లే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. బోర్ల దగ్గరే కుటుంబాలు నివసిస్తూ నీటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ — పల్నాడు జిల్లాలో గిరిజనులు అధికంగా నివసించే మండలాల్లో తాగునీరు, సాగునీరు లేక వర్షాధార వ్యవసాయంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలు విఫలమై నష్టాలు రావడంతో వలసలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే ప్రాజెక్టు ప్రారంభించకపోతే రైతులు, గిరిజనులు కలిసి ప్రత్యేక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జలసాధన సమితి అధ్యక్షుడు వీరయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూర్ వెంకటేశ్వర్లు, కంతేటి శివరామకృష్ణ, మోహన్, చందు, సిపిఐ(ఎంఎల్) కార్యదర్శి ఎస్కే ఫిరోజ్, కార్మిక నాయకుడు మునగపాటి ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రమేష్, రైతు నాయకులు రాజా, సురేష్, సత్యనారాయణ, గిరిజన నాయకుడు శ్రీను నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story : వరికిపూడిశాల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలి — లేకపోతే రాజీనామా చేయాలి: రైతు, ప్రజా సంఘాల హెచ్చరిక )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version