సొసైటీల ద్వారా సున్నా వడ్డీకే రైతు రుణాలు
జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు
న్యూస్ తెలుగు/వినుకొండ : చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులకు వ్యవసాయ సహకార సంఘాలు (పీ ఏ సీ ఎస్)ద్వారా సున్నా వడ్డీ కే రుణాలు మంజూరు చేస్తున్నట్లు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు తెలిపారు. వినుకొండ పి. ఏ. సి. ఎస్. కార్యాలయం సొసైటీ వార్షిక ప్రగతిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మక్కెన మాట్లాడుతూ. వినుకొండ పి. ఏ. సీ.ఎస్ పరిధిలో 1900 మంది రైతులకు, 47 డ్వాక్రా సంఘాలకు 10 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సొసైటీల ద్వారా లక్ష రూపాయలు వరకు వడ్డీ లేని రుణాలు, అదనంగా రు. 2 లక్షలకు 32 పైసలు వడ్డీకే రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. వినుకొండ పరిధిలోని 8 సొసైటీల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. సన్న, చిన్న కారు, మధ్య తరగతి రైతులు సొసైటీల ద్వారా వచ్చే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని మక్కెన కోరారు. సంక్రాతి నుండి పాత రుణాలు వసూలు ప్రారంభించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి, సెంట్రల్ బ్యాంకు ఏజీమ్ సుబ్బారావు, వినుకొండ పి ఏ సీ డైరెక్టర్ శ్రీనివాసరావు, నోడల్ అధికారి రవి, సొసైటీ కార్యదర్శి సికె రెడ్డి, సూపర్ వైజర్ బ్రాహ్మయ్య, వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.(Story : సొసైటీల ద్వారా సున్నా వడ్డీకే రైతు రుణాలు)
