అలరించిన కోలాట నృత్య బృందం
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు లో హరే శ్రీనివాస పేరుతో నూతనంగా ఏర్పడ్డ కోలాట కళా బృందం స్థానిక చింతూరు శబరి ఒడ్డు లో వేంచేసియున్న కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో చేపట్టిన కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
చింతూరు, ఎర్రంపేట గ్రామాలకు చెందిన పలువురు ఆసక్తికర మహిళలు, చిన్నారులు నెల రోజులుగా రెండు బృందాలుగా ఏర్పడి కోలాటం ప్రదర్శనను నేర్చుకున్నారు. మందలపల్లి కి చెందిన కోలాట నాట్య గురువు వెంకటేష్ కోలాట నాట్య బృందానికి తర్ఫీదు నందించారు. నాట్య గురువు వెంకటేష్ ఆధ్వర్యం లో గురువారం మహిళలు, చిన్నారుల గజ్జల ( మువ్వలు ) పూజను ఆలయ పూజారి కలగా ప్రసాద శర్మ నిర్వహించారు. అనంతరం కళాకారులకు మువ్వ ధారణ చేసిన నాట్య గురువు కళా బృందానికి కర్పూర హారతి ఇచ్చి కోలాట నాట్య ప్రదర్శన ప్రారంభించారు. రాత్రి 7 గంటల నుండి ఒంటిగంట వరకు కొనసాగిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. గణపతి, హారతి కోపు, కృష్ణుడి తదితర కోపులు అద్భుతంగా ప్రదర్శించారు. పక్క రాష్ట్రమైన చత్తీస్గడ్ నుండి గోపాల్ గురూజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరే శ్రీనివాస కోలాట బృందాన్ని ప్రశంసించారు. కోలాట బృందానికి గజ్జలు, దుస్తులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మందలపల్లి కి చెందిన గుర్రం వెంకటేష్, గండికోట మధు, సాయి, చెంచయ్య, గోపాల్ గురు జి లను హరే శ్రీనివాస కోలాట బృందం శాలువలతో సత్కరించారు. కోలాటం పై ఆసక్తిపరులు తనని (6305581195) ను సంప్రదించాలని కోరారు. (Story:అలరించిన కోలాట నృత్య బృందం)

