పట్టణంలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తున్నా
210 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకం చేపడతాం
కౌన్సిలర్ లింగమూర్తి ని అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా పయనిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 32 వ వార్డులో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. మున్సిపాలిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో మున్సిపాలిటీలు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వార్డుల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా పనిచేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పట్నంలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకుని మౌలిక వసతులు కల్పించడంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి ఆధ్వర్యంలో 31,32 వాటిలో అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, నిధులు కేటాయించిన వెంటనే లింగమూర్తి చొరవతో సిసి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులు పూర్తిచేయడం అభినందనీయమన్నారు. వార్డుల్లో పనులు కేటాయించగానే కౌన్సిలర్ లింగమూర్తి లాగా ముందుకు వచ్చి పనులు చేపట్టే ప్రజలకు వసతులు కల్పించే దిశగా వార్డుల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని కోరారు. పట్టణంలో శాశ్వత త్రాగునీటి పథకం చేపట్టడమే తన ఆశయమని,210 కోట్లతో పనులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తాము త్రాగునీటి పథకానికి నిధులు తెస్తే గత పాలకులు సమస్యను పరిష్కరించలేని అసమర్థులన్నారు. రెండేళ్లలో శాశ్వత త్రాగునీటి పథకంతో పాటు, తాము మున్సిపాలిటీకి అప్పగించిన 22 ఎకరాల ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి చేపట్టి చూపుతామని తెలిపారు. పట్టణంలోని 32 వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు, పైపులైన్లు రైతుల మౌలిక వసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో మున్సిపాలిటీలు అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నాయని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కూటమి పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : పట్టణంలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తున్నా )

