రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతిగా కూటమి ప్రభుత్వ పాలన
రూ.10లక్షల కోట్ల అప్పుల్లోనూ ఠంఛనుగా పథకాలు
బొల్లాపల్లిలో సుఖీభవ అన్నదాత- పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జీవి.
వినుకొండ నియోజకవర్గంలో 45,898 మంది రైతులకు రూ.31.04 కోట్లు జమ..
న్యూస్ తెలుగు/వినుకొండ : రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి అన్న విధానంగానే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతోందని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. జగన్ వదిలి పోయిన రూ. 10లక్షల కోట్ల అప్పుల్లోనూ ఆగని సంక్షేమం, ఠంఛనుగా పథకాల నిధుల జమనే అందుకు నిదర్శనమన్నారు. బుధవారం బొల్లాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విడుదల చేశారు. సభా వేదిక నుంచి వినుకొండ నియోజకవర్గంలోని 45,898 మంది రైతు కుటుంబాలకు రూ.31.04 కోట్లు విడుదల చేశారు. కేంద్రం ద్వారా పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ నిధులను కలిపి మంజూరైన మొత్తాన్ని భారీ చెక్కు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు తెలుగుదేశం పాలన ఎప్పుడు ఉన్నా రైతులు సంతోషం, ఆత్మగౌరవంతో ఉన్నారన్నారు. గత వైకాపా ప్రభు త్వంలో అందుకు పూర్తి విరుద్ధంగా రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండవ స్థానంలో నిలవడం సిగ్గుచే టని ఎద్దేవా చేశారు. చివరకు వారు వదిలి పెట్టి పోయిన ధాన్యం బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రవ్యాప్తంగా 46.84లక్షల మందికి రూ.9,372 కోట్లు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులంతా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా రన్నారు. నేడు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తుంటే నాడు జగన్ రాష్ట్రవాటా కింద 7,500 మొత్తం రూ.12,500 మాత్రమే ఇచ్చారు గుర్తు చేశారు. వినుకొండ నియోజకవర్గాన్ని ఉద్యానపంటల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఉద్యాన, కూరగాయల పంటలకు ఎకరాకు పందిళ్లకు రూ. లక్ష వరకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అలానే 90% రాయితీతో డ్రిప్ పరికరా లు అందిస్తూ రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అంతకు ముందు బొల్లాపల్లిలో సాగు చేసిన మిరప, పొగాకు పంట పొలాలను సందర్శించి రైతులతో ముచ్చటించారు. పంటలుగా ఏమేం వేశారు, ఎలా పండాయో అడిగి తెలుసుకున్నారు. పంట పొలాల్లోనే రైతులతో కలిసి భోజనం చేశారు. అర్హత ఉన్న ఏ రైతుకైనా సాయం అందకపోతే టోల్‌ఫ్రీ నెంబర్ 155251కు ఫోన్ చేయాలని, వెంటనే అధికారులు స్పందిస్తారని చెప్పారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఆదర్శంగా నిలబడాలని, తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని, దాన్ని నెరవేర్చేందుకు రైతులంతా ముందుకు నడవాలన్నారు. ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు, లాభాలు సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేయాలని రైతులను కోరుతున్నట్లు జీవి ఆంజనేయులు తెలిపారు.(Story : రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతిగా కూటమి ప్రభుత్వ పాలన )

