ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు చేరాలి
ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు కోరారు. వినుకొండ మునిసిపల్ కౌన్సిల్ హాల్ నందు సోమవారం సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందించి కూటమి ప్రజాపాలనను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి సోలార్ పానెల్ పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని, “సూర్య ఘర్” పథకం ఉపయోగాలను ప్రజలకు తెలియపరచాలన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. గత ఎమ్మెల్యే ఎలా దుర్భాషలాడారో అందరూ చూశారని, కానీ తమ సంస్కారం అది కాదని, ఉద్యోగులను గౌరవిస్తామని, ప్రేమిస్తామని, సహకారం అందిస్తామని, కష్టాల్లో ఉంటే ఆదుకుంటామని పేర్కొన్నారు. తనతో పాటు కూటమి నాయకుల సహాయ సహకారం కూడా అధికారులకు ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి తోడు ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో వినతుల విషయంలో జవాబుదారీతనంలో వ్యవహిరించాల్సి న అవసరం ఉందన్నారు. అనంతరం మాట్లాడుతూ ధ్రువపత్రాల కోసం ప్రజలను పదేపదే తిప్పకుండా సకాలంలో సేవలు అందించాలని, అందుకు సచివాలయాల ఇన్‌ఛార్జులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి స్పష్టంగా చెప్పాలని, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో విధివిధానాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డు, బూత్‌లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా అవినీతికి పాల్పడడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగితే అటువంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, వినుకొండ మండల వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి)

