రైస్ మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రైస్ మిల్లర్లు సీఎంఆర్(మిల్లింగ్ చేసిన ధాన్యం) అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని జగత్‌పల్లి, మనిగిళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వనపర్తిలోని రాఘవేంద్ర రైస్ మిల్లును కూడా సందర్శించి మిల్లింగ్ పురోగతిని సమీక్షించారు.కేంద్రాల ఇన్‌ఛార్జులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా, ధాన్యాన్ని సరిగ్గా తూకం వేయాలి తూకంలో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రానికి వచ్చిన ప్రతి రైతు వివరాలను, ధాన్యం మొత్తాన్ని, చెల్లింపు వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయాలి మరియు పారదర్శకత పాటించాలి. ధాన్యాన్ని కొనుగోలు చేసే ముందు, తేమ శాతాన్ని ఖచ్చితంగా పరిశీలించిన తరువాతే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటా వేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రంలో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి. తద్వారా రాబోయే ధాన్యం నిల్వకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. వనపర్తిలోని రాఘవేంద్ర రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ గారు, మిల్లు యజమాన్యానికి పలు సూచనలు చేశారు. రైతులకు నష్టం కలిగించకుండా ధాన్యాన్ని జాగ్రత్తగా దించుకోవాలన్నారు. మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన మేరకు అదనపు శ్రామికులను (లేబర్‌ను) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని (రైస్‌ను) ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే ప్రక్రియ అయిన సీఎంఆర్‌ను త్వరగా పూర్తి చేసి, అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. సీఎంఆర్ అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు మరియు మిల్లింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం, అవకతవకలు జరగకుండా చూడాలని, రైతాంగానికి పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సూచించారు. (Story:రైస్ మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలి)

