బాలల దినోత్సవం కాదు..బాలల భవిష్యత్తు దినం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని తపస్విని కిడ్స్ ప్లే స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులు కేక్ కట్ చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “బాలల దినోత్సవం ఒక పండుగ మాత్రమే కాదు… అది బాలల భవిష్యత్తును గుర్తుచేసే ప్రత్యేక రోజు” అని పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు మరింత సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత కాలంలో ఫ్యాషన్, అవాంఛనీయ అలవాట్లు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అంతకంటే ప్రమాదకరంగా పాఠశాలలవరకు గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారులు చేరుకున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు విఫలమవుతున్నాయని, వీటిని అడ్డుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉంది” అని ఆయన అందరిని మరొక్కసారి చైతన్యపరిచారు.ఈ కార్యక్రమం యాజమాన్య సభ్యులు రామ్ రెడ్డి, ఉపాధ్యాయునిలు వరలక్ష్మి, స్వప్న, భాస్కర్,కాసింభి, తదితరులున్నారు.(Story:బాలల దినోత్సవం కాదు..బాలల భవిష్యత్తు దినం)

