పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్ర
– కోటి సంతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న జగన్
– విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం : ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. బుధవారం చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అబద్ధాలు, అసత్య ప్రచారాలు,కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1550 కోట్లు ఖర్చు చేయటమే తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయించని జగన్ రెడ్డి నేడు ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నేటికీ ఫౌండేషన్ కూడా వేయని మెడికల్ కాలేజీలు ఉన్నాయని, పులివెందులతో సహా ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయటం నాటి వైసిపి ప్రభుత్వానికి చేతకాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడి రావటం ఇష్టంలేని జగన్, వైసిపి నేతలు పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు ఇటువంటి కుట్రలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. పిపిపి మోడ్ ద్వారా 500 ఉన్న మెడికల్ సీట్లు 1750 కి పెరుగుతాయని, అంతేకాకుండా 110 మెడికల్ ఫ్రీ సీట్లు పేద విద్యార్థులకు అందుతాయని, కాలేజీల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. పిపిపి మోడ్ అంటే జగన్కు అర్థం కాకపోవటం విచారకరమన్నారు. పేద విద్యార్థులకు ఫ్రీ మెడికల్ సీట్లు రావడం, పేదలకు ఫ్రీగా కార్పోరేట్ వైద్యం అందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని, అందుకే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఓర్చుకోలేని వైసిపి బురద చల్లడమే పనిగా పెట్టుకోవడం అత్యంత హేయమని అన్నారు. పేదలకు మంచి వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి పేదవానికి 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఒకపక్క సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసిపి అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు సహించరని తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. (Story:పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్ర)
