Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు

రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు

రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎసరు పెట్టారు
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బొల్లా

న్యూస్ తెలుగు/వినుకొండ : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేసే దుష్ట యత్నాన్ని నిరసిస్తూ వైసిపి అధిష్టానం పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమంలో భాగంగా బుధవారం వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలోనే ఐదు మండలాల నుండి వైసిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపివేయాలని, బ్యానర్ తో బొల్లా నిరసన ర్యాలీ ప్రారంభించగా, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట సాగారు. వైసిపి కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీ సురేష్ మహల్ రోడ్డు, ఆర్టీసీ రోడ్డు, శివయ్య స్తూపం సెంటర్ మీదుగా నరసరావుపేట రోడ్డు నుండి తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ నిలిపివేయాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. చంద్రబాబు పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు కాలేదని, జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి ప్రారంభించగా కొన్ని పూర్తి అవటం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను నిర్వీరం చేసేందుకు వారు వారి బంధువులకు అప్పచెప్పేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, పేద విద్యార్థులకు సీట్లు, పేద కుటుంబాలకు వైద్యం సమన్యాయంలో దక్కుతుందని, అలాకాకుండా ప్రైవేట్ పరం చేస్తే పేదలకు పూర్తి అన్యాయం జరుగుతుందని బొల్లా అన్నారు. వైసిపి హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి, ఆయా ప్రాంతాలలో మద్యం బెల్ట్ షాపులు ఏరులై పారిస్తున్నారని ఆయన అన్నారు. చట్టం కూటమి ప్రభుత్వ చుట్టమై, శాంతిభద్రతలు పూర్తిగా విఫలమై, ప్రత్యర్థులపై పగ తీర్చుకుంటున్నారని ఆయన అన్నారు. తన హయాంలో ఎన్ఎస్పి కాలనీ స్థలంలో వంద పడకల ఆసుపత్రికి అనుమతులు తెచ్చి నాబార్డ్ నిధులు కూడా మంజూరు చేస్తే, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చీప్ విప్ హోదాలో ఉండి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను ఆనాడు చేసిన కృషి ఫలితంగా సింగర చెరువులో పూర్తిస్థాయి లో నీరు నిల్వ ఉంటూ నేటి వరకు మంచినీరు కొరత లేకుండా ప్రజలు కుళాయిల ద్వారా నీరు వాడుకుంటున్నారని బొల్లా గుర్తు చేశారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వైసిపి హయాంలో ప్రజలకు ఎంతో చేరువులో ఉండగా, నేడు డాక్టర్లకు బిల్లులు చెల్లించని కారణంగా ఆ పథకం నిర్వీర్యం అయిందని, ఈ పథకాన్ని మూలన పడవేసి సిగ్గు లేకుండా టిడిపి అధిష్టానం, బీహార్ ఎన్నికలకు వెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెడతాం, జైలు పాలు చేస్తాం అంటూ కూటమి ప్రభుత్వం నానా యాగి చేస్తున్నదని, వైసిపి దేనికి భయపడదని, కూటమి ప్రభుత్వం ఇలాగే, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ముందుకు వెళితే కూటమి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని బొల్లా హెచ్చరించారు. అలాగే కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నుండి లక్ష ప్రజల సంతకాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం తహసీల్దార్ సురేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, దండు చెన్నయ్య, ఎం రామతులసి రెడ్డి, ఎం. ఎన్ ప్రసాద్, కే దేవరాజ్, శివ, బేతం గాబ్రియేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ప్రభాకర్, ఐదు మండలాల పోలీసు బందోబస్తు తో ర్యాలీని అనుసరించారు. (Story:రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!