సహజ సౌందర్యానికి నిలయం ఆడపరాయి జలపాతం
సాలూరు ఆర్ధిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న పర్యాటక రంగం
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

న్యూస్ తెలుగు /సాలూరు : సహజ సౌందర్యానికి నిలయం దళాయివలసలోని ఆడపరాయి జలపాతం అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. మంగళవారం సాలూరు మండలం కురుకుటీ పంచాయతీ పరిధిలో గల దళాయివలస గ్రామంలోని ఆడపరాయి వాటర్‌ఫాల్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు, కలెక్టరుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండిన అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సాలూరు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దళాయివలస వాటర్‌ఫాల్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పర్యాటక శాఖతో సమన్వయంగా ఈ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని, రహదారులు, పార్కింగ్ సౌకర్యం, విశ్రాంతి కేంద్రాలు, భద్రతా చర్యలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్యులు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తో కలిసి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ జలపాతాల ఖిల్లా మన్యం జిల్లా అని, ప్రకృతి సోయగాలతో వికసిస్తుందని అన్నారు. జిల్లాలో గల అన్ని జలపాతాలను గుర్తించి పర్యాటకంగా ఈ ప్రాంతానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని జలపాతాలను ప్రారంభించుకున్నామని, దీన్ని కూడా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. పర్యాటక రంగం ద్వారా గిరిజన యువతకు ఉపాధి లభించనుందని, స్థానిక గిరిజనులే ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సాహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పర్యాటకుల కొరకు మౌలిక వసతులు, రవాణా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. సీజన్ స్టార్ట్స్ పేరుతో ఒక్కొక్క పర్యాటక ప్రాంతాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు చేశామని కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ కొత్త పర్యాటక ఆకర్షణ ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. (Story:సహజ సౌందర్యానికి నిలయం ఆడపరాయి జలపాతం)

