లక్ష్యం ఉన్న విద్యార్థి దిశ పట్టుదలతో ముందుకు సాగాలి
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి :
లక్ష్యం ఉన్న విద్యార్థి దిశ పట్టుదలతో ముందుకు సాగాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారు నగర్ కాలనిలోని హాద్య కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్ ను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పోటి పరీక్షల్లో లెక్కల పట్టు, సమయపాలన, దృష్టి కేంద్రీకరణ అత్యంత కీలకమని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… మీరు ఎస్సై, కానిస్టేబుల్ కావాలని లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయం ప్రతీ విజయానికి క్రమశిక్షణ, కృషి, సమయపాలన పునాదులు నేను కూడా మీలాగే విద్యార్థి దశలో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. విజయానికి కేవలం కలలు కాదు, క్రమబద్ధమైన సాధన కావాలి. రోజూ నిర్దిష్ట సమయపట్టికతో లెక్కల సాధన చేయడం, మాక్ టెస్ట్ ల ద్వారా తన బలహీనతలను గుర్తించడం మీ లక్ష్య సాధనానికి దారి చూపుతుంది. మీరు సాధించే ప్రతి సెకను లెక్కలోకి వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, “మీ ప్రయత్నం శ్రమతో, నిబద్ధతతో ఉంటే పోలీసు ఉద్యోగం ఖాయం. ప్రతి లెక్క, ప్రతి సూత్రం మీద పట్టు సాధిస్తే పరీక్ష భయం మీకు ఉండదని, అభ్యర్థులకు చదువులో నిబద్ధత, శారీరక దృఢతతో పాటు మానసిక స్థైర్యం కూడా అవసరమని వివరించారు. విద్యార్థులు ఎస్పీ ప్రసంగం ద్వారా ఉత్సాహభరితంగా స్పందించారు. రోజూ లెక్కలు సాధన చేయండి – విజయం మీ చేతుల్లోనే ఉంటుందని ఎస్పీ తెలిపారు. అనంతరం కోచింగ్ సెంటర్లో గ్రాండ్ టెస్టులో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story:లక్ష్యం ఉన్న విద్యార్థి దిశ పట్టుదలతో ముందుకు సాగాలి)

