పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి
వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే పండుగని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసుకార్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వారి సతీమణి బండి అపర్ణ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ బతుకమ్మ వేడుకలలో జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల అధికారులు, సిబ్బంది, మహిళ అధికారులు, వారి కుటుంబసభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకేచోట చేర్చి, రంగురంగుల చీరలతో బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో ఆడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సందడి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్ద పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎస్పీ తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని ఎస్పీ అన్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ పోలీసు సిబ్బంది,వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సాంప్రదాయ ఉత్సాహాన్ని పంచుకున్నారు. మహిళా పోలీసు సిబ్బంది అందరూ రంగురంగుల చీరలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరిపారు. అనంతరం అందంగా, సాంప్రదాయ శైలిలో బతుకమ్మలను రూపొందించిన వారికి ప్రత్యేక బహుమతులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి సతీమణి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, బండి అపర్ణ గారు, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వర రావు, కార్యాలయం ఏవో, సునందన, వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూర్ సీఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, మహిళా ఎస్సైలు, స్వాతి, రాణి, రజిత,దివ్య. హిమబిందు, జిల్లాలోని ఎస్సైలు, మహిళ పోలీసు సిబ్బంది పోలీసుకార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story:పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి )

