స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
న్యూస్ తెలుగు/వనపర్తి : స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కీలక భూమిక పోసించాడని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులుర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని, స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని, దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ గారు అని కొనియాడారు. కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ, తర్వాత 1967, 1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా, అనంతరం దామోదరం సంజీవయ్య గారి క్యాబినేట్లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ కోసం ఉద్యమించి, ఉద్యమకారులతో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారని వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయం ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ )

