అన్నం పెట్టే రైతుకు బస్తా యూరియా ఇవ్వలేని పాలకులు: సీపీఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : అన్నం పెట్టే రైతుకు బస్తా యూరియా ఇవ్వలేని పాలకులు దేశాన్ని ఏలటం రైతుల దురదృష్టకరమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. మంగళవారం జిల్లాలో యూరియా కొరతకు నిరసనగా వనపర్తి ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుకు యూరియా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో రమేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు పృథ్వినాదం అధ్యక్షతన జరిగిన సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. తెలంగాణ అడిగిన యూరియా ఇచ్చి ఉంటే రైతులకుఇన్ని కష్టాలు వచ్చేవి కావన్నారు. వరి పంటకు రెండో విడత యూరియా వేసే సమయం దాటి పోతోందన్నారు. సకాలంలో వేయకపోతే దిగుబడి తగ్గుతుందన్నారు.. రైతులు ఉచితంగా యూరియా ఇమ్మనటం లేదనిడబ్బులు పట్టుకొని క్యూలో ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడ్డా ఇవ్వకపోవడం కేంద్రపాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. సుమారు 45 రోజుల నుంచి పిఎసిఎస్ లు, ప్రైవేట్ డీలర్ల వద్ద బస్తా యూరియా కోసం క్యూ లైన్ లో పనులు వదులుకొని తిండి తిప్పలు లేకుండా పంపిణీ కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నారన్నారు. కేంద్రం తెలంగాణ జిల్లాలో గణపురం గోపాల్పేట అమరచింత ఆత్మకూరు పానగల్లు అన్నిచోట్ల రైతులు రోడ్ ఎక్కుతున్నా పాలకుల్లో చలనం లేదన్నారు. టోకెన్లు ఇచ్చిన 15 రోజులకు కూడా యూరియా ఇవ్వటం లేదన్నారు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పడం తప్ప యూరియా పూర్తిస్థాయిలో రైతులకు అందించింది లేదన్నారు. యూరియా కొరత తీర్చకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జే. చంద్రయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం, వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, మాజీ సహాయ కార్యదర్శి ఎర్రకురుమయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, వంశీ, జ్యోతి, సుప్రియ, బాలస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు. (Story :అన్నం పెట్టే రైతుకు బస్తా యూరియా ఇవ్వలేని పాలకులు: సీపీఐ)

