మహిళలకు రక్షణ కవచం శక్తి (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్
మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు
న్యూస్‌తెలుగు/విజయనగరం :జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ అదేశాలతో పట్టణం లో పూల్ భాగ్ కాలనీలో గల కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్ధినులకు శక్తీ యాప్ పట్ల, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్. గోవిందరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – విద్యార్ధినులకు (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయడం, దాని పని తీరును గురించి క్షుణ్ణంగా వివరించారు. మహిళల మొబైల్ ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని, ఒక కుటుంబ సభ్యుడు మీకు తోడు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ను ప్రెస్ చేసినట్లయితే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకొని, రక్షణగా నిలుస్తారన్నారు. మహిళల భద్రతకు ఈ యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ ఉందని, మహిళలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలు, ఆటోల్లో ప్రయాణించినపుడు సేఫ్ ట్రావెల్ ఆప్షన్పై క్లిక్ చేసి, చేరుకోవాల్సిన ప్రాంతాన్ని నమోదు చేస్తే, వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకొనేంత వరకు వారి ప్రయాణంపై పోలీసులు నిఘా పెడతారన్నారు. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టుకొని, చదువుకోవాలని ఇతరులపట్ల ఆకర్షితులు కావద్దని, వారు చెప్పే మాయమాటలు నమ్మి, జీవితాలను నాశనం చేసు కోవద్దన్నారు. 18సం.లు నిండకుండా అమ్మాయిలు ఇష్టపూర్వకంగా వ్యవహరించినా, వేధించినా, వెంటవడినా పోక్సో చట్టం క్రింద నేరంగానే పరిగణిస్తారన్నారు. ఈ తరహా నేరాల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల జీవితాల పూర్తిగా నాశనమవుతాయని, నేరం నిరూపణ అయితే 10 నుండి 25 సం.లు వరకు జైలుజీవితం అనుభవించాల్సి వస్తుందన్నారు. కావున, విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనుకావద్దన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో చురుకుగా వుండే విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులతో శక్తి వారియర్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. విద్యార్దినులకు విద్యతో పాటు స్వీయ రక్షణ మెలుకువలు కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే డయల్ 100/112 కు లేదా 1972 కు గాని వెంటనే తెలియజేయాలని విద్యార్థులను డిఎస్పీ ఆర్.గోవిందరావు కోరారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో అమర్చిన సిసిటివి కెమెరాల పనితీరును ఎప్పటికప్పడు పరిశీలించాలని పాఠశాల యాజమాన్యంను కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ శిరీష, శక్తి బృందం కానిస్టేబుళ్ళు, పాఠశాల ఉపాధ్యాయులు , సిబ్బంది పాల్గొన్నారు. (Story:మహిళలకు రక్షణ కవచం శక్తి (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్)

