Homeవార్తలుతెలంగాణక్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలి

క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలి

క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలి

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి  :  క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ సూచించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ వనపర్తి జిల్లాను సందర్శించారు. జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మత పెద్దలతో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో క్రిస్టియన్ మతస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించుకునే అంశాల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం నడుస్తుందని, అన్ని కులాలను సమానంగా ఆదరిస్తూ, అన్నీ కులాలు, మతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందున జిల్లాలోని క్రైస్తవ సోదరులు అందరూ సమిష్టిగా ఐక్యమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను
క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
క్రైస్తవులకు వెంకటాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ ప్రార్థనా స్థలం నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో క్రైస్తవుల సమాధులకు స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా క్రైస్తవులకు అందాల్సిన అన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ క్రైస్తవులకు బి.సి.(సి) కుల ధృవీకరణ పత్రం జారీ విషయంలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రైస్తవులకు వనపర్తి పట్టణంలో ఇప్పటికే సమాధుల కొరకు 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని దానికి ప్రహరీ నిర్మించుకునేందుకు రూ.30 లక్షల నిధులు సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. అట్టి స్థలంలో గుట్టలు, రాళ్ళు ఉన్నాయని అంటున్నందున దానిని కొంతవరకు చదును చేయించి మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే కేటాయించిన రూ. 30 లక్షల నిధులకు అదనంగా మరిన్ని నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అమడబాకుల తండాలో క్రైస్తవ ప్రార్థనా మందిరానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. వెంకటాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా స్థలాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు ఇప్పటికే జిల్లాలో ఉచిత్షంగా కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా మైనార్టీలకు అమలు చేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను జిల్లాలో పారదర్శకంగా అర్హులైన వారికి అందేవిధంగా చూస్తామని కలెక్టర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
భారత దేశంలో క్రైస్తవులు అణచివేతకు గురి అవుతున్నారని, ఇటు ఎస్సీ సర్టిఫికెట్ దొరకక అటు బి.సి. (సి) సర్టిఫికెట్ దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నిర్మించుకోవడానికి ఇతర మతస్తులు అడ్డుపడుతున్నారని అదే విధంగా ప్రభుత్వ పరంగాను చర్చిల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. తమ స్వంత ఇళ్లలోనే చర్చిగా చేసుకొని సువార్తలు చెప్పుకుందామనుకుంటే కూడా అభ్యంతరాలు తెలుపుతున్నారని చైర్మన్ దృష్టికి తెచ్చారు.
సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వివక్షకు గురవుతున్నామని తెలిపారు.
ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో చర్చి నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలకు కేటాయించాలని, ప్రతి గ్రామంలో సమాధుల కొరకు స్థలం కేటాయించాలని వాటికి ప్రహరీలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో, పట్టణ కేంద్రములో క్రిస్టియన్ సామాజిక భవనం మంజూరు చేయాలని కోరారు.
మైనారిటీ ముస్లింలకు హజ్ యాత్రకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లే క్రైస్తవులకు జెరూసలేం యాత్రకు వెళ్ళేందుకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందజేయాలని కోరారు. క్రైస్తవులు తమ ఇళ్ళలో ప్రార్థన చేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జలుద్దీన్, జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మత పెద్దలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.(Story:క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!