మహిళా ప్రయాణికులు ఫుల్..బస్సులు నిల్..
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల అవస్థలకు నిలయంగా మారింది….
న్యూస్ తెలుగు/వినుకొండ :ముఖ్యంగా కారంపూడి, విజయవాడ, పిడుగురాళ్ల మార్గాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, సోమవారం రోజున బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు సరిపోక రద్దీగా మారడంతో, బస్సెక్కిన వారికి, బస్సు కోసం ఎదురుచూసే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ప్రయాణికుల ప్రకారం, ప్రస్తుత బస్సు సర్వీసులు వారి అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల తరబడి బస్సులు కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, కారంపూడి, విజయవాడ మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. డిపో మేనేజర్ జె.నాగేశ్వరరావును వివరణ కోరగా శని, ఆదివారాలు సెలవులు కారణంగా సోమవారం రద్దీ పెరిగిందని మహిళా ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనన్నారు.(Story:మహిళా ప్రయాణికులు ఫుల్..బస్సులు నిల్..)

