పేదల కంటి వైద్యానికి అండగా శివశక్తి ఫౌండేషన్ శంకర కంటి ఆస్పత్రి
పీ-4లో భాగంగా భవిష్యత్‌లో మరో 100 బంగారు కుటుంబాల దత్తత
పేదలకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : పేదల కంటి వైద్యానికి శంకర్ కంటి ఆస్పత్రిలో కలసి శివశక్తి ఫౌండేషన్ తరఫున అందిస్తున్న సేవలు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. 1998లో శివశక్తి ఫౌండేషన్ ప్రారంభించింది మొదలు 28ఏళ్లుగా ఇలా పేదలకు కంటి ఆపరే షన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని, తన కుమారుడు, మనవడి హయాంలో కూడా నిరంతరాయంగా అవి కొనసాగుతా యని తెలిపారు. వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో శనివారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రి సౌజన్యం తో కంటి శుక్లాల శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీఫ్‌విప్ జీవీ ముఖ్య అతిథిగా పాల్గొని కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ. పేదలకు సేవలు అందించడమే తన కర్తవ్యమని, అందులో భాగంగానే కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శంకర నేత్ర వైద్యశాల ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తోందని అందుకు ఆ బృందం మొత్తానికి అభినందన లు తెలియజేస్తున్నా అన్నారు. ఇప్పుడు ఒక కన్నుకు ఆపరేషన్ చేయించుకున్న వారు మూడు నాలుగు నెలల తర్వాత రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చన్నారు. రాజకీయాల కోసం ఇవన్నీ చేయడం లేదన్న జీవీ తనను వినుకొండ నియోజకవర్గ ప్రజలు 3 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలు ఎంతో బాధ్యత ఇచ్చారని ఆ మేరకు నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా చేస్తానని తెలిపారు. ఇటీవలే పీ-4లో భాగంగా స్థానికంగా 100 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వాళ్లందర్నీ సాధికారిత బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మరో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటామన్నారు. సూపర్‌సిక్స్‌లో భాగంగా ఇటీవలే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆర్థిక ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుండడం ఎంతో సంతోషంగా అనిపిస్తోందన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికివందనం ద్వారా పేదల విద్యకు కొత్త ఊతం లభించినట్లైందన్నారు. రెండు నెలల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. మొత్తం 10లక్షలమందికి కొత్త పింఛన్లు, ఇళ్లు కూడా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు పెమ్మసాని. నాగేశ్వరరావు, ఎన్. శ్రీనివాసరావు, ఆర్ వీరాంజనేయరెడ్డి, పల్లమీసాల దాసయ్య, బొంకూరి రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : పేదల కంటి వైద్యానికి అండగా శివశక్తి ఫౌండేషన్ శంకర కంటి ఆస్పత్రి )

