గందరగోళంగా మారిన వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ఆగస్టు 15న వైసిపి కౌన్సిలర్లను ఆహ్వా నించనందుకు..
సమావేశం నుండి వాకౌట్ చేసి వెళ్ళి పోయిన కౌన్సిలర్స్
న్యూస్ తెలుగు /వినుకొండ : మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాడు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇస్మాయిల్ ఎజెండాలో పొందుపరచిన 36 అంశాలను చదివేందుకు ప్రారంభించగా, ఎనిమిదవ వార్డు వైసీపీ కౌన్సిలర్ పి.బ్రహ్మయ్య అడ్డు తగిలి మాట్లాడుతూ. ఆగస్టు 15వ తేదీన తన వార్డు పరిధిలోని సచివాలయంలో జండా ఆవిష్కరణకు తనను ఎందుకు పిలవలేదంటూ అధికారులపై ఆగ్రహించారు. ప్రజలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారని, ప్రోటోకాల్ పాటించకుండా ఎవరెవరునో పిలిచి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహించారు. అలాగే వైసిపి వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు, గంటా కాలేషా, రాజేష్ ఖన్నా, ఎమ్. ఎస్. కె. భాష, మొత్తం పది మంది వైసీపీ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహించారు. మున్సిపల్ సమావేశాలకు తామెంతో సహకరిస్తున్నామని, అభివృద్ధి కోసం పార్టీలను చూడకుండా సహకరిస్తున్నామని, ప్రోటోకాల్ పాటించకుండా మమ్మల్ని దూరం పెడుతున్నారని వారు ఆగ్రహించారు. ఒక్కోసారి సమావేశాలు కూడా మాకు తెలపకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తామే సమావేశం తెలుసుకొని వస్తున్నామన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించి రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని వైసిపి కౌన్సిలర్లు మండిపడ్డారు. గాంధీ జయంతి నాటికి అక్కడ విగ్రహం ఏర్పాటు చేసి గాంధీ చౌక్ సెంటర్ గా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేస్తూ, సమావేశం బహిష్కరించి వెళ్లిపోయారు. కాగా వాకౌట్ చేసి వెళ్లిపోయిన వైసిపి సభ్యులు సంతకాలు చేసి ఉండటంతో, ఉన్న సభ్యుల తోటి చైర్మన్ దస్తగిరి సమావేశం నిర్వహించి. అజెండాలో పొందుపరిచిన అంశాలన్నింటినీ సమావేశం ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని, వాసవి క్లబ్ పెద్దల అనుమతితోనే తొలగించడం జరిగిందని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరచి మరల విగ్రహం ఏర్పాటు చేస్తామని తాము తెలిపామని, అయితే విద్యుత్ స్తంభాలు తొలగింపు ఆలస్యమైన కారణంగా జాప్యం జరిగిందన్నారు. కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ మాట్లాడుతూ. గాంధీ విగ్రహం తొలగించారే గాని ఆగస్టు 15 కి ఏర్పాటు చేయలేకపోవడం అవమానకరమన్నారు. గాంధీ జయంతి నాటికి ఆ ప్రాంతంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి గాంధీ చౌక్ సెంటర్ గా నామకరణం చేయాలని కౌన్సిల్లో తీర్మానించాలని వినతిపత్రాన్ని చైర్మన్ దస్తగిరి కి అందజేశారు. 26వ అంశంలోని రోడ్డు నిర్మాణం అంశంపై 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి అడగ్గా ప్రజా సౌలభ్యం కోసం గతంలో మాదిరి రోడ్డుకు సరిపడా స్థలం ఇవ్వగలిగితేనే రోడ్డు వెడల్పు చేయటం జరుగుతుందని సమాధానం ఇచ్చారు.(Story:గందరగోళంగా మారిన వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం)

