ప్రజా సమస్యల పరిష్కారమే
తొలి ప్రాధాన్యం కావాలి
అన్ని విభాగాల అధికారులకు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఆదేశం
న్యూస్ తెలుగు /వినుకొండ :నియోజకవర్గవ్యాప్తంగా అర్జీలతో వచ్చే ప్రజల ప్రతిసమస్య పరిష్కారమే అధికారుల తొలి ప్రాధాన్యం కావాలని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. ఎప్పుడైతే అది సాధిస్తామో… తమ వద్దకు వచ్చే ఫిర్యాదులు, అర్జీలు ఎప్పుడైతే సున్నాకు చేరుకుంటాయో అప్పుడే ప్రజాదర్బార్ కార్యక్రమాలకు నిజమైన సార్థకత అన్నారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు నేరుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని, పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, పోలీస్, తాగునీటి సహా వివిధ సమస్యలపై 41 అర్జీలు వచ్చాయి. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ నియోజకవర్గం అభివృద్ధి, స్థానిక, ప్రజా సమస్యలకే ఎల్లవేళల తన తొలి ప్రాధాన్యమన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా తన కార్యాలయానికి రావచ్చొని.. ఈ ప్రజాదర్బార్ ఒక వేదిక మాత్రమే అన్న ఆయన ప్రతీ రోజు, ప్రతీ క్షణం నేను ప్రజల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులు కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. (Story:ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం కావాలి)