సమస్యలపై జిల్లా కలెక్టర్ తో సమావేశమై వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : జోగులాంబ గద్వాల జిల్లా లో నియోజకవర్గ పరిధిలోని నెలకొన్న సమస్యలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు గారితో కలిసి,గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తో ప్రత్యేక సమావేశమై,వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినతిపత్రంలో సమర్పించిన అంశాలపై మాజీ మంత్రి మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాకు ఈ సంవత్సరం పంటకు సాగుకు సరిపడే విధంగా కాకుండా గత సంవత్సరం నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ సంవత్సరం వానకాలంనకు 15 వేల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించింది.ఇప్పటి వరకు వివిధ సంస్థల ద్వారా రైతులు 14,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి వినియోగించుకున్నారు.కాని ఇంకా 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అత్యవసరం.యూరియా లేక రైతులు తల్లడిల్లుతున్నారు.ఈ జిల్లాకు(గద్వాల) రావలసిన యూరియా వాటా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారముంది. రైతులు ప్రతి రోజు వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే యూరియా రాకపోతే రైతులు నష్టపోయే ప్రమాదముంది..
సమైక్య రాష్ట్రంలో చేపట్టిన జూరాల ప్రాజెక్టు నత్తనడక సాగిన సంగతి అందరికి తెలిసిందే.జూరాల ప్రాజెక్టు వద్ద గేట్ల ఇనుపతాళ్ళు తెగిపోవటంతో బి.ఆర్.యస్. పార్టీ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి పత్రికల ద్వారా తెసుకెళ్ళి ఇనుప రూప్ లు,రబ్బర్ సీళ్ళు ఇతర సాంకేతిక సామాగ్రి గేట్లకు మార్చాలన్న, వాటిని అమర్చాలన్నా స్టాప్క్ గేటును జలాశయం గేట్ల వెనుక భాగంలో అడ్డుగా పెట్టి ముందు భాగంలో గేట్ల మరమ్మతులు చేయాలని కోరగా అందుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డ గారు పరిశీలన చేసి ఇందుకు కావలసిన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించినారు. అయితే అధికారులు వీటి మరమ్మతు కొరకు దాదాపు 4 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు పంపించి రెండు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రసుత్తం జూరాల వరద 2 లక్షల క్యూసెక్కులు ఉంది.వరద 5.6 లక్షల క్యూసెక్కులు దాటితే అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలవలసి ఉంటుంది.అట్టి సమయంలో గేట్లు మొరాయిస్తే పరివాహక ప్రాంతంలో వరద జలాలు వెనక్కుమళ్ళి గ్రామాలు ముంపునకు గురై తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.వారం రోజుల క్రితం జరిగిన రాష్ట్రస్థాయి ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష సమావేశంలో జూరాల గేట్ల మరమ్మతు అంశం చర్చకు రాకపోవడం దారుణం.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గేట్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము.రాష్ట్రంలోని అన్ని నదులు పొంగి పొర్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళను ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపాలన్న ద్యాస లేదు. గద్వాల నియోజక వర్గంలోని సంగాల రిజర్వాయర్ 0.6 టి.యం.సి. సామర్థ్యం కలదు. తాటికుంట రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టి.యం.సి. కలదు. అయితే ఇంతవరకు తాటికుంట రిజర్వాయర్ ను కేవలం 0.5 టి.యం.సి. నీటిని మాత్రమే నింపినారు.సంగాల రిజర్వాయరు ఇంతవరకు నీటిని నింపలేదు అని అన్నారు.నెట్టెంపాడు ప్రాజెక్టు పథకంలోని 99,100 ప్యాకేజిలను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేసింది.భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంను వరి పంట సాగులో మించింది.దేశం తెలంగాణ వైపు చూసే విధంగా కెసిఆర్. ప్రభుత్వం పని చేసింది.కాని నేటి రాష్ట్ర ప్రభుత్వం రైతులను బజారున పడేసింది.కెసిఆర్. నాయకత్వంలో రైతు ఎలాంటి దిగులు లేకుండా రైతుబంధుతో,రైతు భీమాతో, 24 గంటల ఉచిత కరెంట్తో,ధాన్యం కొనుగోలుతో,ఎరువుల లభ్యతతో రాజుగా బ్రతికినాడు.కాని నేటి ప్రభుత్వం అన్ని విషయాలలో రైతులకు భరోసా కల్పించటంలో,ఆదుకోవటంలో విపలమైంది అని మండిపడ్డారు. పై విషయాలలో ప్రభుత్వంతో మాట్లాడి యూరియా కొరత లేకుండా,జూరాల గేట్ల మరమ్మత్తు,సంగాల రిజర్వాయర్ ను నీటితో నింపి తాటికుంట రిజర్వాయర్ సామర్థ్యం మేరకు నీటిని నింపి,నెట్టెంపాడు పథకంలోని 99,100 ప్యాకెజిలను చేపట్టకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యములో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట రాములు,చక్రధర్ రావు,పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి,మోనేష్,పటేల్ జనార్దన్ రెడ్డి,గంజిపేట రాజు,వెంకటేష్ నాయుడు,వెంకటేశ్వర రెడ్డి,కురవ పల్లయ్య,డి.శేఖర్ నాయుడు,రాయపురం వీరేష్,జాంపల్లి భరత్ సింహారెడ్డి,ఎండీ.మాజ్,రజిని బాబు,గొనుపాడు రాము,చాకలి శ్రీనివాసులు,నరసింహులు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు,యూత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(Story :సమస్యలపై జిల్లా కలెక్టర్ తో సమావేశమై వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి )

