కామ్రేడ్ సిద్ధాబత్తుల సిపిఐ పార్టీకి సేవలు చిరస్మరణీయం
సంతాప సభలో సిపిఐ నాయకులు
న్యూస్ తెలుగు /సాలూరు : కామ్రేడ్ సిద్ధాబత్తుల రామచంద్రరావు ప్రజలకు,సిపిఐ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఐ పార్టీ ఉమ్మడి జిల్లా సెక్రెటరీ ఉమ్మి రమణ అన్నారు.శనివారం సిద్ధాబత్తుల సంస్మరణ సభ రామచంద్రరావు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా రామచంద్రరావు చిత్ర పటానికి పూలదండ వేసి సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు.అనంతరం ఉమ్మడి విజయనగరం జిల్లా ఎఐటియుసి నాయకురాలు బలగరాధ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో భారతకమ్యూనిస్టు పార్టీ నాయకులు రామచంద్రరావు సేవలనుకొనియాడారు.విజయనగరం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం,సమ సమాజ స్థాపనకోసం రామచంద్రరావు చివరి శ్వాస వరకు కృషిచేశారన్నారు.కార్మిక హక్కులను కాపాడేందుకు అనునిత్యం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు రామచంద్రరావు అని కొనియాడారు.సాలూరు నియోజకవర్గంలోని అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు.కురుకూటి, మోసూరు,కొట్టక్కి భూ పోరాటాలలో చురుకైన పాత్ర పోషించి పేదలకు న్యాయం చేశారన్నారు.సుదీర్ఘ కాలం పాటు సాలూరు మోటారు కార్మికుల యూనియన్ అధ్యక్షులు సేవలందించారన్నారు.సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగారన్నారు.ఎఐటియుసి ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగారన్నారు.జ్యూట్ మిల్ సమస్య పరిష్కారం కోసం కృషిచేశారన్నారు.పోరాటాలు,నిర్భందాలతో పలు కేసులను ఎదుర్కొన్నప్పటికీ తను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగారే తప్ప వెనకడుగు వేయని ధీరుడు రామచంద్రరావు అన్నారు.గిరిజన ప్రాంతాల సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండటంతో పాటు వాటి పరిష్కారం కొరకు రామచంద్రరావు విశేష కృషి చేశారన్నారు.పట్టణంలో కౌన్సిలర్ గా కూడా సేవలందించారన్నారు.రామచంద్రరావు మరణం పార్టీకి,కార్మిక లోకానికి తీరని లోటని మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు అన్నారు.ప్రముఖ న్యాయవాది కండా ప్రసాదరావు మాట్లాడుతూ తన జీవితమంతా పేదల పక్షాన నిలిచిన రామచంద్రరావు పేద ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారన్నారు.ఈ కార్యక్రమం లో పార్వతీపురం మన్యం జిల్లా రైతుసంఘం కార్యదర్శి, మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు,సాలూరు మోటారు వర్కర్స్ యూనియన్ నాయకులు గంధం శంకరరావు,బుడితి భారతి,సూర్యం,ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (Story:కామ్రేడ్ సిద్ధాబత్తుల సిపిఐ పార్టీకి సేవలు చిరస్మరణీయం)

