మహనీయుల త్యాగాలు మరువలేనివి జిల్లా ఎస్పీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్., సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వికరించి జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. “బ్రిటీష్ పాలన నుండి మనకు స్వాతంత్ర్యం లభించి నేటితో 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించింది. ఈ శుభ సందర్భంలో మన స్వాతంత్ర్య సమరయోధుల గొప్ప త్యాగాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను తెలిపినారు. “పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలి. ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మన స్వాతంత్ర్యానికి నిజమైన సార్థకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశం “భిన్నత్వంలో ఏకత్వం” అనే గొప్ప సిద్ధాంతానికి ప్రతీక అని, వివిధ భాషలు, జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరం ఒకే తాటిపై నడుస్తున్నామని ఆయన గుర్తు చేశారు. “భారతీయులుగా జన్మించినందుకు మనమందరం గర్వపడాలి. ప్రతి ఒక్కరూ తమ విధులను అంకితభావంతో నిర్వహించి, ప్రజల మన్ననలు పొందాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏవో, సునందన, వనపర్తి సిఐ, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్,సిసిఎస్ సిఐ, రవిపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story: మహనీయుల త్యాగాలు మరువలేనివి జిల్లా ఎస్పీ)
