పర స్త్రీని తల్లి, సోదరిగా భావించాలి: ఎన్ఎఫ్ఐ డబ్ల్యు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పర స్త్రీని తల్లి, సోదరిగా భావించాలని, అప్పుడే మహిళా నేరాలు తగ్గుతాయని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ, జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి అన్నారు. ఆదివారం వనపర్తి ఆఫీస్ లో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఆధ్వర్యంలో రాఖీ పండుగను జరుపుకున్నారు. మహిళా నేతలు సిపిఐ నేతలు కార్యకర్తలకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కృష్ణవేణి అధ్యక్షతన సమావేశం జరిగింది. మాట్లాడుతూ.. స్త్రీని ఆట, విలాస వస్తువుగా చూసే దుస్థితి సమాజంలో నెలకొందని ఈ పోకడ మారాలన్నారు. స్త్రీని మాతృమూర్తిగా సోదరిగా చూసే సంస్కారం మగ పిల్లలకు రావాలన్నారు. అది కుటుంబం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలన్నారు. అశ్లీల చిత్రాలను, పోస్టర్లను ప్రభుత్వం నిషేధించాలన్నారు. యువత మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాల్ అన్నారు. తల్లిదండ్రులు మగ పిల్లల ప్రవర్తన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా నేరాలు తగ్గాలంటే శిక్షలు వేయటం ఒక్కటే సరిపోవటంలేదని, సమాజంలో నైతిక విలువలు పెంచాలన్నారు.
ధర్మస్థలి పుణ్యక్షేత్రం దారుణాల బాధ్యులను కఠినంగా శిక్షించాలి
కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలి పుణ్యక్షేత్రం కు వెళ్లిన మహిళలు బాలికలను అపహరించి అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు. 1995 నుంచి 2014 వరకు సుమారు 500 మందిని చంపి ఉంటారనే ప్రచారం జరుగుతోందన్నారు. ఒక కార్మికుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ సాగిస్తోందన్నారు. ఈ దారుణాలను ఎన్ఎఫ్ఐ డబ్ల్యు తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దారుణాలకు బాధ్యులు ఎంతటి వారైనా పేక్షించవద్దని పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పుణ్యక్షేత్రాలు వద్ద పక్కడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మహిళా నేతలు వెంకటమ్మ జ్యోతి విద్యార్థి స్పందన, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సీనియర్ నేత కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తిపట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story:పర స్త్రీని తల్లి, సోదరిగా భావించాలి: ఎన్ఎఫ్ఐ డబ్ల్యు)