స్మార్ట్ మీటర్ల విధానాన్ని , ట్రూ ఆఫ్, సర్దుబాటు ఛార్జిలను రద్దు చేయాలి : సిపిఎం
న్యూస్ తెలుగు/చింతూరు : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆఫ్, ఇందన సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల పెంచి భారాలు వేసే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని, స్మార్ట్ మీటర్లు విధానాన్ని తీసుకువచ్చి విద్యుత్ వినియోగదారులకు నష్టం చేసే నిర్ణయాలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ చింతూరు కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కరెంటు చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందని బిల్లులు పెరిగి జనం గగ్గోలు పెడుతుంటే చార్జీలు పెంచలేదని, ఆ పాపం మాది కాదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడం దుర్మార్గమన్నారు..సాంకేతికంగా వచ్చిన మార్పులతో కరెంటు చార్జీలు తగ్గించవచ్చు. ఒకనాడు రూ.12 ఉన్న సోలార్ విద్యుత్ నేడు 2 రూపాయలకే లభిస్తోంది. అయినా బిల్లులు పెంచుతూనే పోతున్నారు. కరెంటు బిల్లు చూస్తే వాస్తవాలు పూర్తిగా అర్థం కావు. ప్రతి నెలా వాడిన కరెంటుపై యూనిట్‌కు రూ.1.90 పైసల నుండి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ఇది అసలు చార్జి. ఇక కొసరు చార్జీలు ఎన్నో. ఫిక్స్‌డ్ చార్జి, కస్టమర్ చార్జి వసూళ్లు సాగుతున్నాయి. సర్ చార్జీలు, పెనాల్టీలు వేస్తున్నారు. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జి (ఎఫ్.పి.పి.సి.ఎ) లతో పెద్ద మోసం జరుగుతోంది. ఏ వస్తువుకైనా, ఏ సర్వీసుకైనా వాడుకున్న సంవత్సరం, ఐదేళ్ల తర్వాత మళ్లీ, మళ్లీ చార్జీలు వసూలు చేయటం విడ్డూరం.. 2014 నుండి 19 వరకు వాడుకున్న కరెంటుపై 36 నెలల నుండి రూ.3 వేల కోట్ల ట్రూఅప్ చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. 2022-23, 23-24 సంవత్సరంలో వాడుకున్న కరెంటుపై రూ.15,485 కోట్ల అదనంగా సర్దుబాటు చార్జీలను కూటమి ప్రభుత్వ హయాంలో మోపారు. ప్రతి నెల, గత నెలలో వాడుకున్న కరెంటుపై సర్దుబాటు చార్జీలు వసూలు చేసుకోవచ్చని మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీని అవకాశంగా తీసుకొని వైసిపి పాలనలో ప్రతి నెలా 40 పైసలు అదనంగా సర్దుబాటు చార్జీల బాదుడు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయకపోగా కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం లోనే రూ. 2787 కోట్ల చేశారు. ఇలా 4 రకాల సర్దుబాటు చార్జీల బాదుడు సాగుతోంది. ఖర్చులు పెరిగి లోటు వస్తే ప్రభుత్వం భరించాలి తప్ప, బిల్లు కట్టిన దానిపై మళ్లీ, మళ్లీ సర్దుబాటు చార్జీలు వేయటం అక్రమం. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అదాని ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లతో దోపిడీలో మరో నూతన అంకం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలోని రెండు కోట్ల వినియోగదారులకు బాగున్న పాత మీటర్లు తొలగించి, అదాని స్మార్ట్‌మీటర్లు దశలవారీగా బిగిస్తున్నారు. ఇది మీటర్ మార్పు మాత్రమే కాదు. విధానం మార్పు. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు ఇది తొలి మెట్టు. 10 సంవత్సరాల పాటు నిర్వహణ అదానికి అప్పగిస్తున్నారు. మీటర్ పెట్టడమంటే, రాబోయే కాలమంతా అదానీ ద్వారా విద్యుత్ సరఫరాకి అంగీకరించినట్లే. తొలి దశలో 41 లక్షల మీటర్లు పెడుతున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రమాదం లేదని, ఉచితమని, కేంద్రం సహాయం చేస్తున్నదని, అన్ని ఇళ్లకు పెట్టబోమని, సమాచారం గంటగంటకి పంపుతామని, బిల్లులు ఎక్కువ రావని, పారదర్శకత ఉంటుందని అధికారులతో ప్రభుత్వం ప్రకటనలు చేపిస్తోంది. సెల్‌ఫోన్ తరహాలో ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలి. సింగిల్ ఫేస్ మీటర్‌కు రూ.9 వేలు, త్రీ ఫేస్ మీటర్‌కు రూ.17 వేలు 93 వాయిదాలలో వినియోగదారులే చెల్లించాలి. గంటగంటకు రీడింగ్ తీస్తారు. పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు. చలికాలం ఒక రేటు, వేసవి కాలం ఒక రేటు చెల్లించాలి. ఇప్పటికే ”టైం ఆఫ్ ది డే” విధానం ప్రకారం కొన్ని సంస్థలకు వేరువేరు రేట్లు వసూళ్లు ప్రారంభించారు. ఈ మీటర్ల వలన మన ఇల్లు, సంస్థ, కుటుంబం మొత్తంపై అదానీ సంస్థ డిజిటల్ నిఘా ఉంటుందని తెలిపారు. ముందు కార్యాలయాల వరకే అని నమ్మించారు. ఆ తర్వాత షాపులు, పరిశ్రమలకే పరిమితం అన్నారు. ఇప్పుడు కొన్ని ఇళ్ళకే అంటున్నారు. కానీ అమలులో వినియోగాదరులకు వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చార్జీల విధానం రద్దు కావాలి. అదనపు వసూళ్లు ఆపివేయాలి. మిగులును వినియోగదారులకు బదలాయించాలి. చార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు ఒప్పందాలు రద్దు చేయాలి. మీటర్ల బిగింపు ఆపాలి. పెట్టిన మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కొన్న వినతి పత్రాన్ని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ జెయియి కి అందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సీసం సురేష్, మండల నాయకులు పొడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, కారం నాగేష్, పాండ్రు నాగార్జున, పల్లపు పెద్ద రాములు, కారం సుందరయ్య, ధర్మల వీరభద్రం, ధర్మలా మల్లయ్య, పల్లపు రమేష్, భీరబోయిన దిలీప్ తదితరులు పాల్గొన్నారు. (Story:స్మార్ట్ మీటర్ల విధానాన్ని , ట్రూ ఆఫ్, సర్దుబాటు ఛార్జిలను రద్దు చేయాలి : సిపిఎం)

