ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం
న్యూస్ తెలుగు/వనపర్తి : అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఖిల్లా ఘన్పూర్ మండల కేంద్రంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు, గృహలక్ష్మి పథకంతో అర్హులైన వారందరికీ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వడమే కాకుండా గతంలో వారు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేసి వారికే అండగా నిలిచిందన్నారు. యువత కోసం దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం తినాలని ఆలోచనతో రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని చెప్పారు. మిగిలిన పెండింగ్ స్కీం లను కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి బీసీలకు రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారని ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇప్పుడు ఖిల్లా ఘనపూర్ లో 3489 మంది లబ్ధిదారుల తో 520 కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లపాటు రేషన్ కార్డులను ఇవ్వడం విస్మరించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని దీనికి లాస్ట్ డేట్ అనేది లేదని ఎప్పుడైనా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలను పొందడానికి సులువు అవుతుందని, కాబట్టి పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియతో పేదలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ ద్వారా కార్డులు తీసుకున్న వారందరూ ప్రభుత్వ పథకాలను పొందవచ్చని కలెక్టర్ గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఖిల్లాఘన్పూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఖిల్లా ఘన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు విజయ్, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు రమేష్, సింగిల్ విండో చైర్మన్ మురళీధర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం )

