గణితంపై పట్టు సాధించి మంచి ఫలితాలు సాధించండి
న్యూస్ తెలుగు/వనపర్తి : విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా ఏర్పరచుకుని అందుకు అనుగుణంగా మంచి ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టర్ పెబ్బేరు మండలంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ గారు, గణితంపై పట్టు సాధించేందుకు సులభమైన ఫార్ములాలు, స్మార్ట్ ట్రిక్స్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా ఏర్పరచుకుని మంచి ఫలితాలను సాధించాలని ప్రోత్సహించారు. అలాగే, విద్యాధికారులకు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అనుకూలమైన, ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం కల్పించాలన్నారు. అదేవిధంగా, పెబ్బేరు లోని వెనకబడిన కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ మౌలిక వసతులను, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి గృహంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, తహసిల్దార్ మురళి, ఎంపీడీవో, ఏఎంఓ మహానంది, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.(Story : గణితంపై పట్టు సాధించి మంచి ఫలితాలు సాధించండి )