ప్రజాపాలనతో కూటమి ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ మేలు
వినుకొండలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజా పాలనతో ప్రతిఒక్కరికీ మేలు జరుగుతోందని, ఇంటింటికీ రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం కనీస సౌకర్యాలు, పథకాలు అందించడంలో విఫలమైన చోటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే పాలన అద్భుతాలను ఆవిష్కరిస్తోందన్నారు. మంగళవారం వినుకొండ పట్టణంలోని 27 వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతోమాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుపరిపాలన లక్ష్యాలు, వాటి అమలు తీరు గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతోపాటు, ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పింఛన్లు పెంపు, కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినుకొండకు సంబంధించి. ప్రత్యేకంగా శాశ్వత మంచినీటి పథకం కోసం రూ.210 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ సహకారంతో స్థానిక మూడు చెరువులను పెద్ద చెరువుగా మారుస్తామని, 3 నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 2.5 సంవత్సరాల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంగా జగన్ నేతృత్వంలోని గత వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. కొట్టండి, చంపండి” వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇవి సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే అజ్ఞాన సంస్కృతి అని అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోరి, బాధ్యతాయుతమైన మాటలు చెప్పాల్సిన నాయకులు, రెచ్చగొట్టే భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. వారి మాటలు, చేతలకు తగినట్లే గత వైకాపా ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్‌లు, అరాచక పాలన పెచ్చుబిగిందని విమర్శించారు. అందుకే చీకట్లో నుంచి వెలుగుకు దారితీసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు జీవీ. ప్రతి అర్హుడికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది” అని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.వి.సురేష్ బాబు, షమీం ఖాన్, పి. దాసయ్య, పి.అయూబ్ ఖాన్, కాశి, జానీ భాష, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. (Story:ప్రజాపాలనతో కూటమి ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ మేలు)

