చారిత్రాత్మకమైన కృష్ణ దేవరావు భవనానికి మరమ్మతులు చేయించి కాపాడుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని చారిత్రాత్మకమైన కృష్ణ దేవరావు భవనానికి మరమ్మతులు చేయించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి అన్నారు. బుధవారం పట్టణంలోని కృష్ణ దేవరావు భవనం కె.డి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. చారిత్రాత్మక కట్టడాన్ని పరిశీలించిన కలెక్టర్ చాలా అద్భుతంగా ఉందని, నిర్మాణంలో వాడిన కట్టెలు, టైల్స్, రాజ భవన నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంత మంచి చారిత్రాత్మక కట్టడాన్ని భవిష్యతు తరాల కొరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవనం మొత్తం శుభ్రం చేయకుండా నిర్వహణ గాలికి వదిలేయడం సరికాదని, మొత్తం భవనం శుభ్రం చేయించాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. రాజావారి భవనం ప్రాశస్త్యంతో పాటు పాలిటెక్నిక్ కళాశాల లైబ్రరీ, తరగతి గదులు, మెట్ల బావిని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, భవన ట్రస్ట్ మేనేజర్, గంధం నాగరాజు కలెక్టర్ ను చూపించి వివరించారు. 1885లో నిర్మించిన ఈ భవనాన్ని రాజా రామేశ్వర రావు 1959లో అప్పటి భారత ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఇచ్చి ప్రారంభోత్సవం చేశారని కలెక్టర్ కు వివరించారు. (Story:చారిత్రాత్మకమైన కృష్ణ దేవరావు భవనానికి మరమ్మతులు చేయించి కాపాడుకోవాలి)

