ఏడాదిలోనే ఇంటింటికీ పథకాలు
జులై 2 న వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం
ప్రభుత్వ విజయాలపై క్షేత్రస్థాయిలో ప్రచారంపై దిశానిర్దేశం
న్యూస్ తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇంటింటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రతిఒక్కరికీ ఏదొక రూపంలో ప్రయోజనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇదే విషయంలో జులై-2 నుంచి నియోజకవర్గం మొత్తం విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాది విజయాలు తెలియజేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుని చేసిన మంచిని వివరించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు నరసరావుపేట రోడ్డులోని గంగినేని కల్యాణ మండపంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై రెండో తేదీ నుంచి నిర్వహించనున్న ‘సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ ప్రచారంపై జీవీ ఆంజనేయులు దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, క్లసర్, యూనిట్ ఇన్‌ఛార్జులు, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, గ్రామ నూతన కమిటీల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, మూడు పార్టీల సమన్వయంపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ డోర్ టూ డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తారని వివరించారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని… ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం అద్భుత అవకాశంగా ఉంటుందని తెలిపారు. (Story:ఏడాదిలోనే ఇంటింటికీ పథకాలు)
