ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీపై AISF,AIYF నిరసన
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రవేట్ పాఠశాలల్లో విద్యార్థుల దోపిడీని ఆపాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని రెండు ప్రైవేటు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీ వరల్డ్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ ఎదుట బైఠాయించి దోపిడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్ మాట్లాడుతూ..1వ తరగతికి రూ. 30 వేల నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారన్నారు. చట్ట విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను, టై బెల్టు బూట్లు పేరుతో అధికంగా డబ్బులు దండుకుంటున్నారన్నారు. అనుమతి లేకుండా కొన్ని స్కూల్ బస్సులను నడుపుతున్నారని, పలు బస్సుల్లో కెపాసిటీకి మించి విద్యార్థులను కుక్కుకొని , బస్సులను అతివేగంగా నడుపుతున్నారని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం 25% విద్యను పేద పిల్లలకు ఉచితంగా అందించాలని కానీ ఏ స్కూల్లోనూ అమలు చేయడం లేదని, అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ వరల్డ్ స్కూల్’పేరులో వరల్డ్ అనే పదాన్ని తొలగించాలన్నారు. పాఠశాల పేర్లు ‘వరల్డ్’ ‘నేషనల్’అనే పదాలు పెట్టటం విద్య హక్కు చట్టానికి విరుద్ధమన్నారు. వరల్డ్ పదం తొలగించాలన్నారు. జిల్లా కేంద్రంలో డిఇఓ ఉన్నతాధికారులు ఉన్న ప్రైవేటు పాఠశాలల దోపిడీపై చర్య తీసుకోవడం లేదన్నారు. తమ డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాలల బాధ్యులు చెప్పారని నేతలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకుంటే విద్యార్థులను సమీకరించి కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు చందు,విష్ను,అరవింద్, చరన్,విజయ్, లక్ష్మమ్మ, భరత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీపై AISF,AIYF నిరసన)